తెలంగాణ తొలి బడ్జెట్‌ ఎందుకు వాయిదా పడింది. కేసీఆర్‌ ఆంచనాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ లేకపోవడమే కారణమా? బడ్జెట్‌ అంటే ఆదాయ వ్యయాల చిట్టా కాదని సిఎం ఎందుకు భావిస్తున్నారు? ఇంతకీ బడ్జెట్‌లో ఆయన ఏం కోరుకుంటున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి అనుకుంటున్న సమయంలో అధికారులు, మంత్రుల అంచనాలు తలకిందులు చేస్తూ.. తిప్పి పంపారు. కేసీఆర్‌ రాజకీయ కారణాలతోనే బడ్జెట్‌ వాయిదా వేశారని ప్రచారం జరిగినా.. అసలు కారణం వేరంటున్నాయి అధికార వర్గాలు. కేసీఆర్‌ ఆంచనాలకు అనుగుణంగా బడ్జెట్‌ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపధ్యంలో బడ్జెట్‌ను ఆరు నెలల పాటు వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. దీనిని కేసీఆర్‌ అనుకూలంగా మలుచుకుని తన ఉద్దేశ్యాలకు అనుగుణంగా మరోసారి కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. కేసీఆర్‌ మొదటి నుంచి ప్రజలకు సుందరస్వప్నం చూపిస్తున్నారు. అభివృద్ధిపై అంచనాలు, ఆశలు పెంచుతున్నారు. అందుకే తన ఆలోచనలకు బడ్జెట్‌లో ప్రతిబింబించాలని ఆయన కోరుకుంటున్నారు. పాత సీసాలో కొత్త సారాలాగా ఆదాయ, వ్యయాలకు బడ్జెట్‌ను పరిమితం చేయాలని కేసీఆర్‌ కోరుకోవడం లేదు. తాను చెబుతున్న అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడానికి బడ్జెట్‌లో స్పష్టమైన లెక్కలు ఉండాలని భావిస్తున్నారు. బడ్జెట్‌కు కొన్ని శాఖలు సమగ్ర విధానాలు, లక్ష్యాలు నిర్ధేశించకపోవడాన్ని గుర్తించిన కేసీఆర్‌ వాటిపై మరింతగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలు ఆదాయ వనరులు, వ్యయాలను సమగ్రంగా పొందుపరచాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారు. సింగరేణి కాలరీస్‌ వంటి సంస్థలు దేశ విదేశాల్లో మైనింగ్‌ చేయడానికి అవకాశాలున్నాయని కేసీఆర్‌ చెబుతున్నారు. దీనికి సంబంధించి లక్ష్యాలు బడ్జెట్‌లో నిర్ధేశించుకోవాలని సూచిస్తున్నారు. నష్టాల్లో ఇతర కంపెనీలను ఎంతకాలంతో లాబదాయకంగా మారతాయి. నిర్ధేశించుకున్న లక్ష్యాలేంటి? విద్యా వ్యవస్థలో మార్పులు ఎంతకాలంలో సాద్యమవుతుంది. నిధులు ఎంత అవసరం. ఈ ఏడాది ఎంత కేటాయిస్తారు వంటి సమగ్రమైన నివేదికలు... లక్ష్యాలు బడ్జెట్‌లో చూపాలనుకుంటున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధుల అవసరమెంత? ఈ ఏడాది లక్ష్యం ఎంతో అందుకు అవసరమైన నిధులు లెక్కలు చూపాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారు. అలా కాకుండా లక్ష్యాలు ఘనంగా ప్రకటించి.. నిధులు అరకొరగా ఉంటే ప్రజలకు సర్కార్‌పై నమ్మకం పోతుందన్నది ఆయన లెక్కని అధికారులు అంటున్నారు. 15 రోజుల్లో బడ్జెట్‌ను మరోసారి తయారుచేసి తీసుకరావాలని.. ఇది రానున్న నాలుగేళ్ల అభివృద్ధికి తొలి అడుగులా ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారట.. క్షేత్రస్థాయి అవసరాల తెలుసుకుని పద్దులు రాయాలని కోరారట. దీంతో అధికారులు మళ్లీ అన్ని శాఖలకు నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. బడ్జెట్‌లో చూపించడమే కాదు.. వచ్చే ఏడాది బడ్జెట్‌ నాటికి పైసా పెండింగ్‌ ఉండకూడదన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. వాస్తవాలకు. బడ్జెట్‌ లెక్కలకు పొంతన ఉండాలన్న ఉద్దేశ్యంతోనే బడ్జెట్‌ను వాయిదా వేశారన్నది అధికార వర్గాల లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: