చంద్రబాబంటే.. హైటెక్ పరిపాలనకు మారు పేరని ఆయన గత 9 ఏళ్ల పాలన చూసిన వారంతా అంటారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆయన తరవాతే ఎవరైనా.. అయితే ఇదంతా మొదటి దఫాలోనేనా.. ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు.. హైటెక్ సంగతి పక్కకుపెట్టి... ముహూర్తాల బాట పట్టారా.. ఇప్పుడు చంద్రబాబు తీరు చూశాక ఈ అనుమానాలు రావడం సహజం. ఎందుకో గానీ ఆయన ఈ మధ్య ముహూర్తాల విషయంలో చాలా పట్టింపుగా ఉంటున్నారు. కొన్నిసార్లు రాజకీయాల్లో దెబ్బ తిన్నాక ఆ మాత్రం జాగ్రత్త ఉండొచ్చు. కానీ ప్రతిదానికీ అదే పోకడ పోతే కష్టమేమో. మొదట.. తెలుగుదేశం అధికారంలోకి రాగానే.. ప్రమాణ స్వీకారంపై ముహూర్తం ప్రభావం పడింది. మే 16న ఎన్నికల ఫలితాలు వచ్చినా రాష్ట్రం విడిపోయినందువల్ల.. జూన్ 2 వరకూ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం రాలేదు. జూన్ 2నే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినా.. చంద్రబాబు మాత్రం.. జూన్ 8 వ తారీఖు వరకూ ఆగారు. అందులోనూ ముహూర్తం నిర్ణయించడంలో అసాధారణ రీతిలో అనిశ్చితి. ముహూర్తం తేదీ, సమయంపై విపరీతంగా మల్లగుల్లాలు పడ్డారు. ఒకసారి ఉదయం అన్నారు. మరోసారి సాయంత్రం అన్నారు. కిందా మీదా పడి చివరకు జూన్ 8 సాయంత్రం ఫిక్స్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిశ్చయించడం వరకూ బాగానే ఉన్నా... మొదటి సంతకం కోసం కూడా మరో ముహూర్తాన్ని నిర్ణయించారు. అంతకు ముందు టీడీఎల్పీ సమావేశం విషయంలోనూ ఇలాగే జరిగింది. లేక్ వ్యూ అతిధి గృహంలో క్యాంపు కార్యాయాన్ని ప్రారంభిచే విషయంలోనూ అంతే. తాజాగా రాష్ట్ర రాజధానిపై ప్రకటన చేసే విషయంలో మరోసారి ముహూర్తాల వీక్ నెస్ బయటపడింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రాజధాని అంశంపై చర్చించేందుకు సోమవారం మంత్రివర్గం సమావేశమైంది. మంగళవారం ఈ అంశంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయాలని భావించారు. ఇక ప్రకటనే తరువాయి అనుకునే సమయానికి మంగళవారం ఆ ఊసే లేకుండా అసెంబ్లీ గడచిపోయింది. ఎందుకయ్యా అంటే.. ముహూర్తం కోసం.. అసెంబ్లీలో ప్రకటనకు మంచి ముహూర్తంలేదని.. గురవారం ఐతే మంచి ముహూర్తం ఉందని పండితులు చెప్పారట. ఇంకేముంది అసెంబ్లీలో రాజధాని ప్రకటన కూడా అప్పటికే వాయిదా పడింది. మొత్తానికి గురువారం మధ్యాహ్నం 12గంటలా 17 నిమిషాలకు చంద్రబాబు రాజధాని అంశంపై ప్రకటన చేస్తారన్న మాట. ఏం చెబుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మంత్రులంతా బయటపెట్టేశారు. ముహూర్తాలపై నమ్మకాలు కాదనలేం.. కానీ ఈ గందరగోళం ఏర్పడకుండా ముందు ముహూర్తం చూసుకున్నాకే ఆ సంగతి బయటకు చెబితే బావుంటుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: