కొత్త రాజధాని ఎక్కడో ఖాయమైపోయింది. ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయడమే తరువాయి. అందుకు ముహూర్తం కూడా ఫిక్సయింది. గురువారం మధ్యాహ్నం 12గంటలా 17 నిమిషాలకు చంద్రబాబు కొత్త రాజధానిపై ప్రకటన చేస్తారు. అది బెజవాడ - గుంటూరు మధ్య ప్రాంతంలో ఉంటుందని ఇప్పటికే తెలిసిపోయింది. కానీ దాన్ని బెజవాడ అని పిలవలేం. గుంటూరు అనలేం.. కాబట్టి కొత్త పేరు పెట్టాల్సిందే. మరి చారిత్రాత్మక నగరానికి ఏం పేరు పెడతారు. ఇప్పుడీ ప్రశ్న ఆసక్తికరంగా మారింది. కొత్తరాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కొంతకాలంగా తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఎన్టీఆర్ పాటే పాడారు. రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే గుంటూరు జిల్లా రైతులు 8 వేల ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. కొత్త రాజధాని నిర్మాణానికి భూమి సేకరణ అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అన్న సంగతి తెలిసిందే. కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నదే ప్రభుత్వ నిర్ణయమా.. ప్రభుత్వం ముందే నిర్ణయించుకుని.. ఎందుకైనా మంచిదని జనంలోకి ఫీలర్లు వదులుతోందా.. అన్న అనుమానాలు లేకపోలేదు. ఇద్దరు ముగ్గురు మంత్రులతో ప్రకటనలు చేయించి.. పెద్దగా వ్యతిరేకత రాకపోతే.. ఎన్టీఆర్ పేరు పెట్టవచ్చని సర్కారు భావిస్తుండొచ్చు. అయితే నిజంగా ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకుంటే.. మాత్రం ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిందే. రాష్ట్ర రాజధాని పేరు చరిత్రలో నిలిచిపోయే అంశం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయానికి వెళ్లడం అంత మంచిదికాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందులోనూ ఎన్టీఆర్ తెలుగోడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నాయకుడే అయినా.. ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రతిరూపంగా నిలుస్తారు. మరి అలాంటి వ్యక్తి పేరు రాజధానికి పెట్టాలంటే ప్రతిపక్షాలు సహకరిస్తాయా.. ఈ విషయంలో వాటి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: