మోడీ వందరోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఒక ప్రధానిగా మోడీ పనితీరును నిర్ణయించడానికి మూడు నెలలు చాలా తక్కువ కాలమే. ఈ పాలనపై అభిప్రాయంతో మోడీ పాలనపై తీర్పు చెప్పలేం.. కానీ పాలన ఏ దిశగా వెళ్తుందని చెప్పడానికి ఈ సమయం సరిపోతుంది. మోడీ వందరోజుల పాలనపై ఇప్పటికే రియాక్షన్లు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న దేశ కార్పోరేట్ రంగం.. మోడీ పాలనకు వందకు 80 మార్కులు కట్టబెట్టింది. కాకపోతే అది కార్పొరేట్ శక్తుల అభిప్రాయం కాబట్టి దాన్ని బట్టి జనం సంతోషంగా ఉన్నారని చెప్పలేం. తాజాగా మోడీ పాలనపై అసలు జనం ఏమనుకుంటున్నారు అనే అంశంపై సీఎన్ఎన్-ఐబీఎన్, టుడేస్ చాణక్య ఓ సర్వే నిర్వహించాయి. అందులో దాదాపు జనంలో మోజారిటీ వర్గం మోడీ పాలన బావుందని చెప్పినట్టు సర్వే వెల్లడించింది. ముఖ్యంగా విదేశాంగ విధానం, హింసను అరికట్టడం, ఆర్థిక రంగాన్నికొత్త పుంతలు తొక్కించడం, ధరల అదుపు వంటి విషయాల్లో మోడీ బాగానే కృషి చేశారని జనం అభిప్రాయపడ్డారట. హైదరాబాద్, బెంగళూరు వంటి 14 నగరాల్లో దాదాపు 6 వేల మందితో మాట్లాడి ఈ సర్వే నిర్వహించారట. పాలన ఓవరాల్ గానే కాకుండా అంశాలవారీగా కూడా అభిప్రాయాలు సేకరించారు. మోడీ విదేశాంగ విధానానికి అన్నింటికంటే ఎక్కువ మార్కులు పడ్డాయి. దాదాపు 70 శాతం మంది మోడీ విదేశాంగవిధానం బావుందని కితాబిచ్చారు. ప్రత్యేకించి పాకిస్తాన్ తో కఠినవైఖరి అవలంబించడం, చర్చల ప్రక్రియ నిలిపివేయడం ప్రజలకు బాగా నచ్చింది. ఇది సరైన నిర్ణయమని దాదాపు 55 శాతం మంది చెప్పారు. నక్సల్ హింస మోడీ వచ్చిన తరవాత బాగా తగ్గిందని 37 శాతం మంది అభిప్రాయ పడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు వెళ్తుందని 41శాతం మంది అభిప్రాయపడ్డారట. ధరల పెరుగుదలను అడ్డుకున్నారని 31 శాతం అన్నారు. ఈ అంశంపై 27 శాతం మంది మాత్రం ధరల పరిస్థితిని అంతగా అడ్డుకోలేకపోయారని చెప్పారు. ఓవరాల్ గా జనం మోడీ పాలనపై బాగానే సంతృప్తి చెందినట్టు సీఎన్ఎన్ సర్వే చెబుతోంది. మరి మీ సంగతేంటి..?

మరింత సమాచారం తెలుసుకోండి: