కొన్నిసార్లు అధికారులు చేసే పొరపాట్లు మంత్రుల మెడకు చుట్టుకుంటాయి. తమకు అంతగా సంబంధం లేకపోయినా.. అధికారుల పొరపాట్ల కారణంగా రాజకీయ నాయకులు విమర్శల పాలవుతుంటారు. మంగళవారం అలాంటి పరిస్థితి నుంచి ఏపీ హోంమంత్రి చినరాజప్ప త్రుటితో తప్పించుకున్నారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక అవ్వడంతోనే ఏకంగా హోంమంత్రి పీఠం దక్కించుకున్న నిమ్మకాయల చినరాజప్ప కొద్దిలో పెద్ద చిక్కులో చిక్కుకోకుండా తప్పించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందేంటే.. అత్యాచార ఘటనలపై శాసన మండలిలో హోంమంత్రి చినరాజప్ప ఓ ప్రశ్నకు బదులివ్వాల్సి ఉంది. సమాధానం సిద్ధం చేసిన అధికారులు.. అందులో ఓ చోట అత్యాచార బాధితురాలి పేరు రాశారు. రేప్ ఘటనల్లో బాధితురాలి పేరు బయటపెట్టకూడదన్నది ప్రాథమిక సూత్రం. పొరపాటో గ్రహపాటో అధికారులు ఆ సంగతి మరిచారు. హోంమంత్రి మండలిలో చదివే సమాధాన పత్రాలు బాధితురాలి పేరుతోనే ముద్రించారు. దాన్ని మండలిలో పంపిణీ చేశారు కూడా. చివరి నిమిషంలో అధికారులు తప్పు గుర్తించారు. ఆ సంగతి హుటాహుటిన మంత్రికి చేరవేశారు. మంత్రి తన సమాధానంలో పేరు రాకుండా జాగ్రత్తపడ్డారు. అసలే చట్టాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న హోంమంత్రి. మరి ఆయనే చట్టాన్ని, నిబంధనలు తుంగలో తొక్కితే ఎలా.. ప్రతిపక్షాలు ఊరుకుంటాయా.. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా.. మహిళల మాన ప్రాణాలంటే అంత చులకనా అంటూ విపక్షాలు ఒంటికాలిపై లేచేవే.. అంతటితో ఆగేదా.. మహిళా సంఘాలు కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవి. అందులోనూ మంత్రి మాట్లాడింది ఏకంగా అసెంబ్లీలో.. దాంతో అసెంబ్లీ రికార్డులకు ఈ తప్పిదం చేరిపోయేది. తప్పు చేసిన అధికారులే.. చివరి నిమిషంలో దాన్ని గుర్తించడం చినరాజప్పను కాపాడిందనుకోవాలి. అందులోనూ ఈ అత్యాచార ఘటన తెలంగాణ ప్రాంతానికి చెందింది. అందులో తప్పు జరిగితే ఈ అంశం కూడా మరో ఇష్యూ అయి ఉండేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: