రాజధాని కోసం క్లారిటీ రానన్నాళ్లూ.. ఎక్కడ.. ఎక్కడ.. ఎక్కడ అంటూ ఒకటే ఉత్కంఠ. బెజవాడా, గుంటూరా, కర్నూలా, వైజాగా, దొనకొండా అంటూ.. ఒకటే ఊహాగానాలు.. మొన్నటి అసెంబ్లీ ప్రకటనతో ఆ సస్పెన్స్ కాస్తా వీడింది. ఎవరేమన్నా.. ఎన్ని విధాల నిరసన తెలిపినా.. రాజధాని బెజవాడ పరిసరప్రాంతాల్లోనే అంటూ చంద్రబాబు తేల్చేశారు. ఐతే.. క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చి.. మళ్లీ ఆయన ఓ మెలిక పెట్టాడు. ప్రకటనల్లో తరచూ కనిపించే షరతులు వర్తిస్తాయి తరహాలో.. చంద్రబాబు కూడా పక్కా క్లారిటీ ఇవ్వకుండా.. బెజవాడ పరిసరాల్లో అన్నాడే కానీ.. ఎక్కడో కచ్చితంగా చెప్పలేదు. అదిగో ఆ మెలికే ఇప్పుడు టీడీపీ నాయకుల్లో చిచ్చుపెడుతోంది. చంద్రబాబు అసెంబ్లీ ప్రకటన ప్రకారం. బెజవాడ చుట్టూ ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చు. ఆ కోణంలో నాలుగైదు ఆప్షన్లున్నాయి. ఎక్కడ రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొస్తే.. అక్కడ రాజధాని అంటున్నాడు. అందుకే ఆ రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ కృష్ణా,గుంటూరు జిల్లా నేతలు కిందామీదా పడుతున్నారు. రాజధాని అంటే మాటలు కాదు. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ ఓ రేంజ్ కు చేరింది. దాన్నుంచి గరిష్ట లాభాలు అందుకోడానికి టీడీపీనేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రాజధాని రేసులో కృష్ణా జిల్లా నేతల కంటే కాస్త గుంటూరు జిల్లానేలలే యాక్టివ్ గా ఉన్నారట. ముఖ్యంగా మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రత్యేకంగా చొరవ తీసుకుని గుంటూరు జిల్లాకు ఎక్కువగా మేలు జరిగేలా ప్రయత్నిస్తున్నారట. రాజధాని ఏర్పాటు చేయాలంటే.. ముందుగా భూములు సేకరించాలి. అంటే అందుకు రైతులను ఒప్పించాలి. అందుకే ప్రత్తిపాటి.. రైతులను ఒప్పించే పనిలో పడ్డారు. ఆ దిశగా కాస్త సక్సస్ కూడా అయ్యారు. తరచూ రైతులతో మేము భూమి ఇప్పించేందుకు సిద్ధం అని ప్రకటనలు చేయిస్తున్నారు. తాజాగా మంగళగిరి రైతులతో కూడా భూములిస్తామని చెప్పించారు. ఈ రాజధాని ఇష్యూ మంత్రుల్లోనూ విబేధాలు తెచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: