దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో పోటీ మరింత తీవ్రంకానుంది. గూగుల్‌ విడుదల చేయనున్న చవక స్మార్ట్‌ఫోన్లను విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ఇ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌లో పోటీ పడుతున్నాయి. గూగుల్‌ సోమవారంనాడు తన ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్లను లాంఛనంగా భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. వీటి ధర 100 డాలర్లు (దాదాపు 6,000 రూపాయలు) లోపే ఉండవచ్చని భావిస్తున్నారు. వంద కోట్ల మం దిని ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వినియోగపరిధిలోకి తెచ్చేందుకు 100 డాలర్లకన్నా తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లను తీసుకురానున్నట్టు గత జూన్‌లో అమెరికాకు చెందిన గూగుల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విభిన్న రకాల స్మార్ట్‌ఫోన్లను తెచ్చేందుకు కంపెనీ సన్నద్ధం అయింది. కాగా స్పైస్‌, కార్బన్‌ కంపెనీల భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్లను విక్రయించాలని ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్స్‌ భావిస్తున్నాయి. మైక్రోమాక్స్‌తో కలిసి ఫోన్లు అమ్మాలని అమెరికాకు చెందిన అమెజాన్‌ భారత అనుబంధ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు మొబైల్‌ ఫోన్ల కంపెనీలు ఆండ్రాయిడ్‌ వన్‌కు సంబంధించి ముమ్మర ప్రచారంచేస్తున్నాయి. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్టులు మొబైల్‌ ఫోన్ల కంపెనీలతో జట్టు కట్టి స్మార్ట్‌ఫోన్లను తమ వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఇలాంటి ధోరణి బాగా పెరిగి పోయిం ది. ఆన్‌లైన్‌లో విడుదలైన స్మార్ట్‌ఫోన్లకు నెటిజన్ల నుంచి స్పందన ఊహించని స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు కూడా ఆన్‌లైన్‌లోనే తమ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: