కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానదికి ఇరువైపులా రాష్ట్ర రాజధాని నిర్మాణం తథ్యమని తేల్చిన ప్రభుత్వం భూసేకరణపై దృష్టి సారించింది. నందిగామ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కాస్తంత జాగుచేసిన రెవెన్యూ సర్వే బృందాలు ఆదివారం నుంచే తమ రహస్య సర్వేలను ఉద్ధృతం చేశాయి. భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తన విధాన ప్రకటన చేసినప్పటికీ సాధ్యమైనంతగా ఆక్రమిత, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, అటవీ భూములను తొలుతగా స్వాధీనపరచుకోవాలని నిర్ణయించుకుంది. ఓవైపు రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేవంటూనే మరోవైపు ఎంచక్కా కోట్లాది రూపాయల విలువైన భూములను గ్రావెల్ తవ్వకాల కోసం జీవోలపై జీవోలు జారీ చేస్తూ కట్టబెడుతోంది. తాజాగా మంగళగిరి మండలంలోని రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన భూముల్లో 10 ఎకరాలను తెనాలికి చెందిన శివారెడ్డికి, మరో 10 ఎకరాలను తాడేపల్లికి చెందిన రంగస్వామికి గ్రావెల్ తవ్వుకునేందుకు లీజుకు ఇస్తూ జూలై 9న పర్యావరణం, అటవీ సైన్స్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి పేరిట 65, 66 జీవోలు వెలువడ్డాయి.  దీంతో ఆక్రమణదారులతో పాటు ప్రైవేట్ భూముల యజమానులు కూడా ఏ క్షణాన తమ భూముల స్వాధీనానికి నోటీస్‌లు జారీ అవుతాయోనని భయాందోళనలు చెందుతున్నారు. రెవెన్యూ, అటవీ, దేవాదాయ శాఖాధికారులు కొద్దిరోజులుగా పాత రికార్డుల దుమ్ముదులిపి ఏయే సర్వే నెంబర్లలో తమ తమ భూములున్నాయో సర్వే జరుపుతున్నారు. వాస్తవానికి దశాబ్దాల క్రితమే అత్యధిక భూములు ఆక్రమణలకు గురికావటమే కాదు అనేకమంది చేతులు మారాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు అవినీతి అధికారులు, సిబ్బంది లబ్ధిపొందుతూ వచ్చారు. తాజాగా ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఇళ్ల స్థలాలు, సాగుభూములు పొందిన లబ్ధిదారుల జాబితాలను చేతపట్టుకుని ఆయా స్థలాలు, భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి, అసలు గృహ నిర్మాణాలు జరిగాయా, సాగు జరుగుతోందా లేదా అని కూడా సమాచారం రాబట్టుకుంటున్నారు. అసలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటివరకు కేవలం ఇళ్ల స్థలాల కోసమే దాదాపు లక్ష ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి పంపిణీ చేయబడింది. అసలు ప్రభుత్వ స్థలాలు కాని, పంట భూములు కాని కొనకూడదు, విక్రయించకూడదని తెల్సినా కొనే్నళ్లుగా అంతులేని విధంగా క్రయ విక్రయాలు జరిగిపోయాయి. పెరిగిన నిర్మాణ వ్యయం తట్టుకోలేక కొందరు, ఊరికి దూరంగా పంట పొలాల మధ్య గుడిసెలు నిర్మించుకోలేనివారు ప్రభుత్వం ఇచ్చిన తమ ఇంటి స్థలాలను చూసుకుంటూ ఇంతకాలం కాలక్షేపం చేశారు. కొందరైతే ఎప్పుడో విక్రయించేశారు. మండలం.. గ్రామస్థాయిలో అసైన్డ్, పోరంబోకు, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలతో ఇప్పటికే మ్యాప్‌లు సిద్ధమయ్యాయి. రెవెన్యూ సిబ్బంది వీటిని చేతబట్టుకుని రహస్య సర్వే సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు జిల్లాల్లో ఖరీదైన ఖనిజాలు, గ్రావెల్ నిక్షేపాలున్న భూములున్నాయి. అలాగే సారవంతమైన నల్ల, ఎర్ర నేలలతో కూడిన భూముల్లో ఏటా రెండు పంటలు పండుతున్నాయి. ఇలాంటి భూములను ప్రభుత్వానికి అప్పనంగా అప్పగించేందుకు ఏ రైతు కూడా సిద్ధంగా లేడు. వందలాది గ్రామాల్లో వివిధ పోరంబోకు స్థలాల్లో వేలాది మంది రేకుల షెడ్లు, గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. రాజధాని పేరిట ఈ భూములన్నింటినీ స్వాధీనపరచుకుంటే వీరంతా రోడ్డునపడాల్సి వస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: