ఒకప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని పదేళ్లపాటూ సమర్థంగా నిర్వహించిన ప్రధానిగా అందరూ ఆయనను పొగిడిన వాళ్లే. ఆయన సరళీకృత విధానాలను అందరూ మెచ్చుకున్నవాళ్లే. అయితే ఇప్పుడందరూ 2జీ తప్పును ఆయనపై తోసేయడానికి ప్రయత్నిస్తున్నారు. యూపీఏ-2 పాపాలన్నీ ఆయనకే అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం... మన్మోహన్‌ సింగ్‌కు ఇది బ్యాడ్‌ టైమ్‌. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు ఆద్యుడని ఆయనను పొగిడిన నోళ్లే ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ఇప్పుడు బొగ్గు, 2జీ స్కామ్‌ల విషయంలో ఆయన నిర్వీర్యతను తప్పుబడుతున్నారు. 2జీ విషయంలో కాగ్‌ మాజీ ఆడిటర్‌ వినోద్ రాయ్‌ మన్మోహన్‌ సింగ్‌ వ్యవహార శైలిని కడిగి పారేసిన మరుసటి రోజే... సొంత పార్టీకే చెందిన కమల్‌నాథ్‌ మొదటిసారిగా నోరు విప్పారు. 2జీ లైసెన్సుల విషయంలో జరుగుతున్న అవకతవకల గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే వాటిని ప్రధాని దృష్టికి తెస్తూ... ప్రధానికి లేఖ రాశానని యూపీఏ హయాంలో మాజీ వాణిజ్య మంత్రిగా పని చేసిన కమల్‌నాథ్ వెల్లడించారు. 2జీ లైసెన్సుల వేలానికి ఒక కమిటీని నియమించమని లేఖలో రాశానని తెలిపారు. తన లేఖపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకొని ఉంటే పరిణామాలు వేరే విధంగా ఉండేవని కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు. తాను హెచ్చరించినా... ప్రధాని ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం తనను నిరుత్సాహపరిచిందని కమల్‌నాథ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని రక్షించుకోవడానికి ఆ పార్టీ నేతలు ఇప్పుడు నానా పాట్లూ పడుతున్నారు. దానిలో భాగంగానే ఆ పార్టీ నేతలు ఇప్పుడు తప్పులన్నీ మన్మోహన్‌సింగ్‌పైకి నెట్టివేసి... తాము నిరపరాధులమని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇక మన్మోహన్ సింగ్‌ రాజకీయ జీవితం ముగిసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: