విదేశీయాత్రల్లో నరేంద్రమోడీ ప్రసంగాలు ఆసక్తికరంగా మారాయి. సహజంగా విదేశాలకు వెళ్లినప్పుడు ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఇంగ్లీషులోనే మాట్లాడుతుంటారు. ఆంగ్లం అంతర్జాతీయ భాషగా మన్ననలు అందుకోవడమే అందుకు కారణం. ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఇంగ్లీషు వస్తే చాలు.. ఏ ఢోకా లేకుండా పర్యటన పూర్తి చేయవచ్చు. అంతెందుకు.. మనదేశంలోని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నా.. ఇంగ్లీషులో మాట్లాడుకోవాల్సిందే. దేశభాషగా హిందీని ఎంపిక చేసినా.. దక్షిణాది రాష్ట్రాల వారికి హిందీపై అంత పట్టు ఉండదు. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం విదేశీ పర్యటనల్లోనూ హిందీలోనే ప్రసంగిస్తూ ఆకట్టుకుంటున్నారు. మొన్నటి జపాన్ పర్యటనలోనూ నరేంద్రమోడీ హిందీలోనే ప్రసంగించారు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో ఆయన ప్రసంగాన్ని అనువాదకులు తర్జుమా చేసి వినిపించాల్సి వచ్చింది. మరి మోడీకి ఎందుకు హిందీపై అంత మమకారం.. అది హిందీపై ప్రేమనా.. లేకపోతే.. ఆంగ్లంపై ప్రధానికి పట్టులేకనా.. అన్నవిషయంపై తలోమాట చెప్పుకుంటున్నారు. అలాగని మోడీకి ఇంగ్లీషు రాదనుకోవడానికీ వీల్లేదు. ఆయన చాలా సభల్లో ఇంగ్లీషులోనూ ప్రసంగించారు. కాకపోతే హిందీలో మాట్లాడినంత సాధికారంగా ఇంగ్లీషులో మాట్లాడలేరేమో. తాజాగా ఆయన ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో మరోసారి తన హిందీ ప్రేమ చాటుకోబోతున్నారు. ఈ విషయాన్ని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితిలో మొదట హిందీ గళం వినిపించింది మాజీ ప్రధాని వాజ్ పేయి. ఆ తర్వాత హిందీ ప్రసంగం మోడీదే. కారణాలేవైనా.. అంతర్జాతీయ వేదికలపై హిందీ మోత మోగిపోతున్నందుకు మోడీని అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: