బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ తనకు రాజ్యసభ సభ్యత్వం మీద ఆసక్తి ఉందని చెప్పుకొచ్చాడు. తనను ఎవరైనా రాజ్యసభకు నామినేట్ చేస్తే స్వాగతిస్తానని ఆమీర్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ , రేఖల్లాగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపినా తనకు ఆమోదమేనని ఆమీర్ అన్నాడు. మరి ఈ హీరోకు కూడా ఇప్పుడు పదవి మీద ఆశ పుట్టిందో లేక అలాంటి పదవి ద్వారా ప్రజాసేవ చేయొచ్చని అనుకొంటున్నాడో కానీ... ఈ విధంగా కోరికను బయట పెట్టుకోవడం మాత్రం ఆసక్తిగా మారింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ గురించి ఏం మాట్లాడని ఆమీర్ రాజ్యసభకు నామినేట్ చేస్తే మాత్రం మేలే అన్నట్టుగా మాట్లాడాడు. మరి ఆమీర్ ను ఎవరు నామినేట్ చేస్తారు? అంటే మాత్రం చెప్పడం కష్టమే. రాష్ట్రపతి కోటా ద్వారా నామినేట్ కావాలన్నా.. దానికి అధికార పార్టీ అండ ఉండాలి. అంత అండే ఉంటే... బీజేపీ వాళ్లే ఆమీర్ ను ఏదో ఒక రాష్ట్రం కోటా నుంచి రాజ్యసభకు పంపగలరు. అయితే ఆ అవకాశాలు స్వల్పమే! ఒకవేళ కాంగ్రెస్ వాళ్లు ఆమీర్ ను రాజ్యసభకు పంపే అవకాశాలు లేకపోలేదు. మైనారిటీ రాజకీయాల పట్ల ఆసక్తిని చూపే కాంగ్రెస్ ఈ హీరోని రాజ్యసభకు పంపి తద్వారా మైనారిటీలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయవచ్చు. ఇక రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయిన సచిన్ టెండూల్కర్ , రేఖల పనితీరు గురించి తనేం వ్యాఖ్యానించలేనని ఆమీర్ అన్నాడు. మరి ఏం అంటే ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయో అని ఆమీర్ భయపడినట్టుగా ఉన్నాడు. మరి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పని తీరు ఎలా ఉందనే విషయం గురించి కూడా స్పందించడానికి ఆమీర్ నిరాకరించాడు. ఆ విషయం నాకన్నా.. మీకే బాగా తెలుసూ అంటూ ఆమీర్ తెలివిగా తప్పించుకొనే ప్రయత్నం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: