ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఒంగోలు పార్ల మెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు నూరుశాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సిడీపై ఇచ్చే పనిముట్లకు సంబంధించి వ్యవసాయ శాఖ ఇప్పటివరకు మార్గదర్శకాలు, రాయితీ శాతం నిర్ణయించకపోవడం దారుణమన్నారు. వ్యవసాయ పనిముట్లపై ఇచ్చే రాయితీని కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పత్తి, మిరప, పండ్ల తోటలను బిందు సేద్యం ద్వారా పండించుకునేలా నూరు శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. లేకుంటే రైతన్న అప్పుల ఊబిలో చిక్కుకుంటాడని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంపీ వెంట యర్రగొండపాలెం శాసన సభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: