అతిత్వరలో శాఖాధిపతుల కార్యాలయాలను రాష్ట్ర నూతన రాజధాని విజయవాడకు తరలిస్తు న్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. తాను కూడా అత్యధిక కాలం అక్కడే ఉంటానని తెలిపారు. అందుకు అవసరమైన తాత్కాలిక వసతులు గుర్తిస్తున్నామని చెప్పారు. మంగళవారంతో వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి లేక్‌వ్యూ అతిథి గృహంలో మంత్రివర్గ సమావేశం అనంతరం పత్రికా సంపాదకులతో దాదాపు 3 గంటలు ఇష్టాగోష్టిగా గడిపారు. అనేక విషయాలు వివరిం చారు. అత్యంత ప్రాముఖ్యతగల రాజధాని ఎంపిక విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించక పోవడంపై 'అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా నిర్వహిస్తాను. ఇప్పుడు వంద రోజులేకదా గడిచింది. రాజధాని విషయంలో ఇలాంటి సమావేశాలు గందరగోళానికి దారితీస్తాయని భావించాను. ఈ విషయంలో మా పార్టీ వాళ్లతో కూడా సంప్రదించ లేదు' అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడిక అలాంటి సమావేశాలు నిర్వహిస్తానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, మంచినీటి సరఫరా, ఆరోగ్య శ్రీ స్థానంలో ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ పేరుతో రెండు న్నర లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు అక్టోబరు 2వ తేదీ నుండి అమలు చేస్తానని ప్రకటించారు. సంక్షేమ పథకాలన్నింటినీ ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తామని, ఇప్పటికే 94 శాతం పని పూర్తయిందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందని ఒకవైపు చెబుతూ, మరోవైపు ప్రకటించిన పథకాలన్నింటినీ అమలు చేస్తామని చెప్పటం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు జవాబుగా 'రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన తరువాత ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పర్చటానికి అన్ని ప్రయత్నా లు చేస్తున్నాను' అని అన్నారు. అందుకు ఆదాయం పెంచటానికి ఇసుక మాఫియాను, రెడ్‌శాండిల్‌ (ఎర్రచందనం) మాఫియాను అరికట్ట టంతో పాటు వనరులను అన్వేషిస్తున్నా మన్నారు. అయితే, 'సంక్షోభంలో ఇప్పుడున్నాం కానీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది' అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజధాని విజయవాడకు ఎటువైపు అన్న అంశంపై రేఖామాత్రంగా కూడా వెల్లడించ నిరాక రించారు. అవసరమైన భూ సేకరణకు 'ల్యాండ్‌ పూల్‌' విధానాన్ని అనుసరిస్తామని, తద్వారా దళారీలను నివారిస్తామన్నారు. ఎప్పటిలోగా నూతన రాజధానికి శంకుస్థాపన జరుపుతారన్న ప్రశ్నకు జవాబుగా, భూ నిర్ధారణ జరగాలని, ఆర్కిటెక్చర్‌ పనులు పూర్తికావాలని, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావాలని చెప్పారు. మరోప్రశ్నకు జవాబుగా ఈ మధ్యంతర కాలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి పలు విధాలుగా యోచిస్తు న్నామని, వారానికి ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కార దినంగా నిర్ధారించటానికి ఆలోచిస్తు న్నామని అన్నారు. ప్రస్తుతం 650 మండల కేంద్రాల తో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించే అవకాశమున్నందున ప్రజల వినతులన్నింటినీ కంప్యూటరైజ్‌ చేసి, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అక్కడికక్కడే పరిష్కారం చూపటానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఒక ప్రభుత్వానికి వంద రోజులు దీర్ఘకాలం కానందున ఇప్పటికప్పుడే తమ విధానాలపై ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: