విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు మరోసారి పైచేయి సాధించారు. పదివేల మందికి ఉపాధి కల్గించే హీరో పరిశ్రమను చేజిక్కించుకున్నారు. ఈ ఒక్క పరిశ్రమ ద్వారానే రెండువేలకోట్ల రూపాయల పెట్టుబడులు సాధించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ పరిశ్రమకు 600ఎకరాల భూమి కేటాయించేశారు. రెండున్నరేళ్లలో ఈ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించబోతోంది. హీరో సంస్థ దక్షిణ భారతదేశంలో ప్లాంట్ ప్రారంభించాలని ఉందని ఆసక్తి చూపించగానే.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. హీరో సంస్థ ప్రతినిధులు ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులను కలిశారు. హీరో సంస్థ ప్రతినిధులను ఆకట్టుకోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమైనట్టే చెప్పుకోవాలి. హైదరాబాద్ వంటి ప్రముఖనగరం, దానికి చుట్టుపక్కలే అందుబాటులో భూములు వంటి ఆకర్షణీయమైన అంశాలున్నా.. హీరో సంస్థను తెలంగాణ అధికారులు ఆకర్షించలేకపోయారు. అనేక ప్రతికూలతలు ఉన్నా చక్కటి రాయితీలు ప్రకటించి చంద్రబాబు హీరో ప్రాజెక్టును తన బుట్టలో వేసుకున్నారు. హీరో ప్రాజెక్టను దక్కించుకోవడంలో చంద్రబాబుకు తన పూర్వ అనుభవం బాగా ఉపయోగపడింది. ఒక సంస్థ విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఏ ఏ అంశాలు కోరుకుంటుంది.. ఎలాంటి రాయితీలు ఆశిస్తుంది.. అనే అంశాలపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉండటం ఏపీకి కలసి వచ్చింది. ప్రాజెక్టు దక్కించుకుతీరాలన్న పట్టుదలతో ఎప్పటికప్పుడు వారి ప్రతినిధులతో టచ్ లో ఉండటం.. ఫాలో అప్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చంద్రబాబు ఫలితం సాధించారు. ఆంధ్ర మాకు అసలు పోటీయే కాదని డాంబికాలు పలకడంతోనే కేసీఆర్ సరిపుచ్చకుండా.. జాగ్రత్తపడటం మేలు. కేసీఆర్ ఇకనైనా జాగ్రత్తపడకపోతే.. ఇలాగే మరిన్ని ప్రాజెక్టులు చేజారే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: