హైటెక్ చంద్రబాబు మరోసారి ప్రపంచంలోనే కొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత గొప్పగా మంత్రివర్గ సమావేశాన్ని కాగితాల్లేకుండా.. కేవలం ట్యాబ్ లతోనే నడిపించారు. దీంతో ఆయన కీర్తి ఇప్పుడు ప్రపంచమంతటా మారుమోగిపోతోంది. ఎంతైనా టెక్నాలజీ వాడుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. చివరకు ప్రధాని మోడీ కూడా.. సోషల్ మీడియాను విపరీతంగా వాడుకునే మోడీకి కూడా ఇప్పటివరకూ ఇలాంటి హైటెక్ ఆలోచన రాలేదంటే బాబు ఎంతగా దూసుకెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఏపీ ఈ -కేబినెట్ మీటింగ్ పై ప్రధాని కార్యాలయం కూడా ఆసక్తి కనబరిచింది. ఈ ఈ-కేబినెట్ మీటింగ్ ఎలా జరిగింది.. అసలేం చేశారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయాన్నిఫోన్లో సంప్రదించి వివరాలు తెలుసుకుందట. ఇంతకూ ఈ ఈ-కేబినెట్ మీటింగ్ ఎలా జరిగింది. ఏమేం చేశారు.. అనే విషయాలు పరిశీలిస్తే.. మంత్రులందరికీ కేబినెట్ మీటింగ్ ఎజెండాలోడ్ చేసిన ట్యాబులను ముందే అందజేశారట. ఎలా వాడాలో కూడా ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎందుకైనా మంచిదని కేబినెట్ మీటింగ్ సమయంలోనూ ట్యాబ్ ఎలా వాడాలో ఓ స్క్రీన్ పై డిస్ ప్లే చేసి ఉంచారట. ఇంత చేసినా ఈ ట్యాబుల గోల అలవాటులేని మంత్రులు ఇబ్బందిపడ్డారట. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పాస్ వర్డులు ఉండేసరికి ఎంటర్ చేయడంలో గందరగోళానికి గురయ్యారట. వాళ్లకు రాకపోయినా.. పక్కోళ్లనడిగి తెలుసుకుని ఎలాగోలా ఎజెండా ఓపెన్ చేశారట. మొత్తం 60 పేజీల ఎజెండా ఓపెన్ అయ్యింది. దాంతో వాళ్ల కష్టాలు తీరిపోయాయి. ఇక ఒకదాని తర్వాత మరొక అంశం పై ట్యాబ్ స్కీన్ పై పైకి కిందకు కదుపుతూ చర్చించారట. అంతా బాగానే ఉంది. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి ఇంతకీ దీంతో ఒరిగిందేంటి. 60 ఇంటు 20 అంటే 1200 కాగితాలు సేవ్ అయ్యాయన్న మాట. మరి ఒక్కో మంత్రికి ట్యాబులకు ఎంత ఖర్చైంది. మామూలు కేబినెట్ మీటింగ్ కు దీనికి ఉన్న తేడా ఏంటి.. అని ప్రశ్నిస్తే మాత్రం సంతృప్తికర సమాధానం మాత్రం రావడం లేదు. ఇది కూడా ఓ ప్రచార జిమ్మిక్కేనా.. బాబు హైటెక్ మాయాజాలమేనా.. జనానికేమైనా మేలుజరిగేది ఉందా.. కొన్నాళ్లాగితే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: