అక్టోబర్ రెండు నుంచి ఘనంగా ప్రారంభం అవుతాయనుకొన్న అన్నా క్యాంటీన్లు వాయిదా బాటకు వెళ్లినట్టుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించదలిచిన ఈ క్యాంటీన్ల గురించి సోమవారం క్యాబినెట్ మీటింగ్ లో చర్చకు రాకపోవడంతో వీటి ప్రారంభోత్సవం వాయిదా పడినట్టుగానే తెలుస్తోంది. పేపర్ లెస్ మీటింగ్ అంటూ జరిగిన ఈ సమావేశంలో అన్నా క్యాంటీన్ల విషయం చర్చకే రాలేదు. ఐదు రూపాయలకే కడుపారా భోజనం అంటూ ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల నుంచి స్ఫూర్తి పొంది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఈ హామీని గుప్పించింది. ఈ క్యాంటీన్ల నిర్వహణ గురించి అధ్యయనానికై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమిళనాడులో కూడా పర్యటించి వచ్చారు. ఎటు తిరిగీ అక్టోబర్ రెండు నుంచి ఇవి ప్రారంభమవుతాయని మొదట ప్రకటించారు. ఎక్కడ ఎన్ని క్యాంటీన్లు పెట్టాలనే అంశం కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదీ ఫైనలైజ్ అయ్యినట్టు లేదు. ఒకవైపు అన్నా క్యాంటీన్ల గురించి తెలుగుదేశం వైపు నుంచినే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... అన్నా క్యాంటీన్ల కాన్సెప్టే తనకు అర్థం కావడం లేదన్నాడు. తమిళనాడులో ఒట్టి సాంబర్ అన్నం తిని కడుపు నింపుకొంటారని.. మన దగ్గర అన్నా క్యాంటీన్ల కాన్సెప్ట్ వర్కువుటయ్యే అవకాశాలు లేవని ఆయన తేల్చేశాడు. మన ఆహారపు అలవాట్లకు ఈ విధానం పనికిరాదని ఆయన పేర్కొన్నాడు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరిగా పెట్టలేకపోతున్న ప్రభుత్వం ఇలా రోడ్డు మీద సరైన అన్నం పెట్టగలుగుతుందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. మరి ఈ క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వం ఏం తేలుస్తుంది? ఎప్పటికి వాటిని ప్రారంభిస్తుంది ? అనేది ప్రస్తుతానికి సందేహాస్పదమైన విషయమే అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: