కేసీఆర్ తో ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపిన చంద్రబాబు.. ఈసారి ఆయనతో విందు చేయబోతున్నారా.. ? విందు రాజకీయాల ద్వారా ఆంధ్రా- తెలంగాణ సమస్యలను పరిష్కరిస్తారా.. అలాగే ప్రతిపక్షనేత జగన్ సంపాదనలో ఏకంగా తిరుమల శ్రీవారితో పోటీపడుతున్నారా.. వెంకటేశ్వర స్వామి కూడా జగన్ అంత వేగంగా డబ్బు సంపాదించలేకపోతున్నారా.. ఏంటీ తలాతోక లేని ప్రశ్నలు అనుకుంటున్నారా.. ఇవన్నీ చంద్రబాబు మీడియా సంపాదకుల భేటీ సందర్భంగా తలెత్తిన ప్రశ్నలు, ఊహాగానాలు. కేసీఆర్ తో ఈ మధ్య సఖ్యతగా ఉంటున్నారు కదా.. మీ ఇద్దరి పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది.. కదా ఆయనతో ఎప్పుడు విందు ఏర్పాటు చేస్తున్నారు.. అని మీడియా సంపాదకులు అడిగారు. దానికి సానుకూలంగానే స్పందించిన చంద్రబాబు..దాందేముంది.. కేసీఆర్ తో విందుకు నేను సిద్ధం అంటూ బదులిచ్చారట. తెలంగాణతో చిన్న చిన్న సమస్యలున్నా.. మాట్లాడుకుంటామని భేషజాలకు పోబోమని చంద్రబాబు అన్నారట. అంతే కాదు ఆంధ్రలో మిగిలిన విద్యుత్ అంతా తెలంగాణకే ఇస్తామని భరోసా కూడా ఇచ్చారట. ఇద్దరు సీఎంలు ఇంత సఖ్యతగా ఉంటే .. తెలుగు ప్రజల మధ్య సుహృద్భావం వెల్లివిరియడం ఖాయం.. ఈ సమావేశంలోనే రాజకీయ విషయాలు కాసేపు పక్కకు పెట్టిన చంద్రబాబు ఆధ్యాత్మిక విషయాలపైనా చర్చించారట. చర్చ తిరుమల వైపు వెళ్లిందట. స్వామికి ఇప్పటివరకూ ఉన్న ఆస్తులు పది వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని.. మరో 20 ఏళ్లలో అవి లక్ష కోట్లు అవుతాయని చంద్రబాబు అన్నారట. ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారు కలుగు జేసుకుని.. ఏడు కొండలవాడికే లక్ష కోట్లు సంపాదించేందుకు 20 ఏళ్లు పడుతుంటే.. కొంతమంది నేతలకు మాత్రం.. నాలుగైదేళ్లలోనే అంత సొమ్ము సంపాదించారని వెటకారం చేశారట. పేరు చెప్పకపోయినా ఆ మాటలు జగన్ గురించి అన్నవేనని అందరికీ అర్థమైపోయింది. పరోక్షంలో జగన్ పై అలా సెటైర్లు వేసే బదులు.. రాష్ట్రంలో, కేంద్రంలో బాబు, బాబు అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయి కదా.. జగన్ అక్రమ సొమ్మును కక్కించవచ్చు కదా.. అని కొందరు పత్రికాసంపాదకులు గుసగుసలాడారట.

మరింత సమాచారం తెలుసుకోండి: