మెదక్ ఉప ఎన్నికల్లో మొదటి నుంచీ తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించడమే కాకుండా మెజారిటీ నిలుపుకొంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెరాస మాత్రమే తీర్చగలదని ప్రజలు తమ పార్టీపైనే ఆశలు పెట్టుకున్నారని మాటలతోనే కాకుండా ఎన్నికల ఫలితాల ద్వారా తెరాస చెప్పగలిగింది. నరేంద్ర మోదీ రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగిన వడోదరలో బిజెపికి లభించిన మెజారిటీ కంటే రెట్టింపు మెజారిటీ సాధించడం ద్వారా తెరాస సత్తా చాటింది. ప్రత్యర్థులు ఇంకా ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంకాకముందే తెరాస రంగంలోకి దిగింది. జిల్లా మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ఎన్నికల సారధ్యం అప్పగించారు. తెరాస అభ్యర్థిని ఎంపిక చేయడం మొదలుకుని తమ ప్రత్యర్థిగా ఎవరుండాలో కూడా తెరాస నిర్ణయించుకుని వ్యూహంలో ప్రత్యర్థుల కన్నా ముందుంది. టిఎన్‌జివోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరు తొలుత బలంగా వినిపించింది. తెరాస దేవీప్రసాద్‌ను రంగంలో నిలిపితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి నిలపడం ద్వారా తెలంగాణవాదానికి బదులు ఉప ఎన్నికల ప్రచారంలో సామాజిక వర్గాల ప్రచారం సాగే విధంగా చూడాలని కాంగ్రెస్, బిజెపి భావించింది. ఈ ఎత్తుగడను గ్రహించిన తెరాస తమ పార్టీ అభ్యర్థిని రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎంపిక చేసింది. కొత్త ప్రభాకర్‌రెడ్డిని రంగంలో నిలిపేసరికి టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి ప్రధాన పార్టీలు మూడూ ఒకే సామాజిక వర్గం అభ్యర్థిని పోటీకి నిలబెట్టడంతో ఎన్నికల్లో సామాజిక వర్గం అనేది ప్రధానాంశం కాకుండా చేయడంలో తెరాస తొలి విజయం సాధించింది. ఇక మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెరాస మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండో స్థానంలో, బిజెపి మూడో స్థానంలో నిలిచింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తెరాస ఏమాత్రం లక్ష్యంగా చేసుకోలేదు. మూడో స్థానంలో ఉన్న బిజెపినే ప్రధాన ప్రత్యర్థిగా వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకుంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేననే సానుభూతి ప్రజల్లో ఆ పార్టీపై ఉంది. పైగా ఆ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మీరెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా సోనియాగాంధీకి లేఖ రాశారు. సమైక్యాంధ్రవాదిగా జగ్గారెడ్డికి లభించిన ప్రచారాన్ని తెరాస ఉప ఎన్నికల్లో ఉపయోగించుకుంది. జనసేన ఏర్పాటు సమయంలో పవన్ కళ్యాణ్ జగ్గారెడ్డి గొప్పనాయకుడు అంటూ అభినందించారు. ఎన్నికల తరువాత జగ్గారెడ్డి పవన్‌ను కలిశారు. మూడు నాలుగు గంటల్లో నామినేషన్ల దాఖలు సమయం ముగుస్తుంది. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డిని బిజెపి అభ్యర్థిగా ఖరారు చేశారు. కాంగ్రెస్ టికెట్ కోసం చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించిన జగ్గారెడ్డి అనూహ్యంగా బిజెపి అభ్యర్థిగా మారారు. జగ్గారెడ్డి గెలిస్తే మోదీ మంత్రివర్గంలో మంత్రి పదవి లభిస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ ఎన్నికల ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన నాయకుడిగానే జగ్గారెడ్డిపై ఉన్న బలమైన ముద్రను తెరాస బాగా ఉపయోగించుకుంది. పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ టిఆర్‌ఎస్ మెజారిటీ సాధించింది. మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 77శాతం పోలింగ్ జరిగితే ఇప్పుడు 66 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. మేలో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా కెసిఆర్‌కు మూడు లక్షల 90వేల ఓట్ల మెజారిటీ లభించింది. ఇప్పుడు 66 శాతం పోలింగ్ జరిగితే తెరాస అభ్యర్థికి మూడు లక్షల 61వేల ఓట్ల మెజారిటీ లభించింది. ఒకవైపు బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డి కావడం, మరోవైపు తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర పడిన టిడిపి అత్యుత్సాహంతో అభ్యంతర కరమైన మాటలతో తెరాస అభ్యర్థికి భారీ మెజారిటీ లభించేందుకు దోహదం చేసింది. మెదక్ సీటు గెలిచి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తామని, సరైన మొగుడిని పోటీకి నిలిపామంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తెదేపా నాయకలు, బిజెపి అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు వారికి ఏమాత్రం ఉపయోగపడలేదని ఎన్నికల ఫలితాలు తేల్చాయి. మేలో జరిగిన ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచి బిజెపి ఇప్పుడు కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. మే ఎన్నికల్లో బిజెపికి 181804 ఓట్లు లభిస్తే, ఇప్పుడు 186,343 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్‌కు గతంలో 260463 ఓట్లు రాగా, ఇప్పుడు 210524 ఓట్లు వచ్చాయి. గతంలో లభించిన మెజారిటీ కన్నా తెరాసకు ఈసారి 30వేల ఓట్లు తగ్గాయి, అయితే 11శాతం వరకు పోలింగ్ తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: