మీడియా చెప్పేదానికి... క్షేత్రస్థాయిలో జనం ఆలోచనలకూ ఎప్పుడూ పొంతన ఉండదని మరోసారి రుజువైంది. మోడీ పాలన ఆహా... ఓహా.. అంటూ సర్వేలు, మోడీయా ప్రచారాలు అంతా బూటకమేనని ఉప ఎన్నికలు చాటి చెప్పాయి. మోడీ సర్కారు నూటికి 80 మార్కులు వేసింది కార్పొరేట్ కంపెనీలేనని.. తాము కాదని జనం ఓటుతో స్పష్టం చేశారు. వందరోజుల క్రితం.. ఈ కుంభ కోణాల కాంగ్రెస్ వద్దని చెప్పింది.. ఇలాంటి కార్పొరేట్ సర్కారు కోసం కాదని జనం తేల్చి చెప్పారు. మొన్నటికి మొన్న ఆసేతు హిమాచలం.. బ్రహ్మరథం పట్టిన జనమే కమలదళానికి గట్టి షాక్ ఇచ్చారు. దేశం మొత్తం మీద 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఫలితాలు ప్రకటించిన 32 స్థానాల్లో బీజేపీ గెలుచుకున్నది కేవలం 12 మాత్రమే. ఎన్నికలకు ముందు ఈ 33లో 23 బీజేపీ స్థానాలే కావడం విశేషం. అంటే కొత్త స్థానాలు గెలుచుకోవడం సంగతి పక్కకు పెట్టి.. ఉన్న స్థానాల్లోనే సగానికిపైగా కోల్పోయిందన్నమాట. సాధారణంగా ఉపఎన్నికల్లో అధికార పార్టీకి కొంత సానుకూలత ఉంటుంది. కానీ ఈసారి అది తిరగబడింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ లెక్క తప్పింది. రాజస్థాన్‌లో కాషాయజెండాకు ఎదురుగాలి వీచింది. తెలుగు రాష్ట్రాలూ కరుణించలేదు. ఈశాన్య రాష్ట్రాలు పట్టించుకోలేదు. చివరికి మోడీ సొంత అడ్డా గుజరాత్‌ ఫలితం కూడా షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలకే జనం జై కొట్టారు. అన్నిటికంటే యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ అరాచకపాలన సాగుతోందని.. యూపీ రేపుల రాజ్యమని.. గుండాగిరీ చిరునామా అని మీడియా ఎంత మొత్తుకున్నా.. 11 అసెంబ్లీ స్థానాల్లో ములాయం పార్టీ 9 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన రాజస్థాన్‌లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బే తగిలింది. ఇక్కడ నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోవడం విశేషం. చివరకు మోడీ సొంత రాష్ట్రంలోనూ... 9స్థానాల్లో కాంగ్రెస్‌ 3 సీట్లు కైవసం చేసుకుంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ సంతోషించదగిన పరిణామం ఏదైనా ఉందంటే ఇది బెంగాల్ ఫలితాలే. మమతా బెనర్జీ ఇలాకాలో ఇక్కడ తొలిసారి ఓ కమలం విరబూసింది. బీజేపీ ఖాతా తెరిచింది. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత చిత్తుచిత్తుగా ఓడిన కాంగ్రెస్ ఈ ఉపఎన్నికల ఫలితాలతో పండుగ చేసుకుంటోంది. ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అనూహ్య విజయమే. ప్రజల ఆకాంక్షలకూ.. మోడీ సర్కారు పనితీరుకూ లంకె కుదరలేదన్న విషయం ఉపఎన్నికలతో తేలిపోయింది. కేవలం కార్పొరేట్‌ ప్రభువులను సంతృప్తి పరిచేందుకు కాకుండా... సామాన్యుడి కోణంలో పాలన సాగకపోతే.. జైకొట్టిన జనమే ఛీ కొడతారన్న హెచ్చరికలు ఉపఎన్నికల ద్వారా కమలనాధులకు చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: