అఖిల భారత సర్వీసు అధికారుల విభజన తుది జాబితాలో మార్పులపై ఏపీ సర్కారు అసంతృప్తితో ఉంది. ఈ మార్పులకు తెలంగాణ సర్కారు ఓకే చెప్పేసినా.. ఏపీ సర్కారు మాత్రం మార్పులపై తీవ్ర అసంతృప్తితో ఉంది. తన అభ్యంతరాలను సర్కారు తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అసమ్మతిని లిఖితపూర్వకంగా ప్రత్యూష్ సిన్హా కమిటీకి తెలియజేశారు. తుది జాబితాలో మొత్తం 15 మార్పులు జరిగాయి. ఇవి తమకు ఏమాత్రం అంగీకారం కావని కృష్ణారావు లేఖలో ఘాటు పదజాలంతో చెప్పినట్టు తెలిసింది. సివిల్‌ సర్వెంట్ల విభజనపై ఢిల్లీలో ప్రత్యూష్‌సిన్హా కమిటి చివరి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర సీఎస్‌లు ఇద్దరూ పాల్గొన్నారు. సివిల్‌ సర్వెంట్ల విభజన జాబితాను డీపీఓటి ద్వారా ప్రధానికి బుధవారం పంపుతారు. ఆయన ఆమోద ముద్ర పడిన తర్వాత అధికారుల విభజన పని పూర్తవుతుంది. దీనికి 10 నుంచి 15 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానికి తుది జాబితాతో పాటు ఏపీ సర్కారు అసమ్మతి నోట్ కూడా పంపుతారు. సో.. ఏపీ అభ్యంతరాలపై తుది నిర్ణయం మోడీనే తీసుకుంటారు. ఆయన ఏపీ అసమ్మతిలో న్యాయం ఉందని భావిస్తే జాబితా మరోసారి మారే అవకాశం ఉంది. కానీ.. మార్పులకు దాదాపుగా అవకాశం లేదని.. ప్రధాని ఆమోదం లాంఛనప్రాయమేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రాష్ట్ర విభజన జరిగిన మూడున్నర నెలల తర్వాత సివిల్‌ సర్వెంట్ల విభజన క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరో 15 రోజుల్లో సివిల్స్ అధికారుల విభజన ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత ఇక రాష్ట్రంలో ఉన్న సాధారణ ఉద్యోగుల విభజన పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికే సాధారణ ఉద్యోగుల విభజనపై కమల్‌నాధ్‌ కమిటీ కసరత్తు చేస్తోంది. వీటికి ఏడాదిపాటు సమయం పట్టవచ్చని కమల్‌నాధన్ కమిటి చెప్పినా, వీలైనంత త్వరగా మరో రెండు మూడు నెలల్లో సాధారణ ఉద్యోగుల విభజన పూర్తికావాలని ఉద్యోగులు కమిటిని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: