మెట్రో రైలు ప్రాజెక్టు ఆగిపోతోందంటూ రెండు పత్రికల్లో వచ్చిన కథనాలు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ విషయంలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు ప్రభుత్వాల ఘర్షణగా... ఓ కంపెనీకి ప్రభుత్వానికి ఉన్న ఘర్షణగా.. రాజకీయ పార్టీల విమర్శల అస్త్రంగా.. ఇలా ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. పత్రికల్లో కథనాలతో ఆగ్రహం చెందిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎల్ అండ్ టీ సీఈవోని పిలింపించి క్లాస్ పీకారట. బిజినెస్ చేస్తున్నారా.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని కేసీఆర్ ఎల్ అండ్ టీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కేసీఆర్ ఆధ్వర్యంలోని ఓ పత్రికే వెల్లడించింది కాబట్టి.. నమ్మక తప్పదు.. అదే నిజమైతే.. సీఈవోలపైనే మండిపడితే ముందు ముందు వేరే ప్రాజెక్టులు వస్తాయా అన్న అనుమానాలు లేకపోలేదు. ప్రాజెక్టుకు సహకరిస్తారా.. లేదా.. మీరే కట్టుకుంటారా అనేలా ఉత్తరాలు రాయడంపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట. ఇది ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడమేనని ఆయన భావిస్తున్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం ఇలా ఉంటే.. టీడీపీ నేతలు మరో బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం బయటపెట్టారు. హైదరాబాద్ మెట్రో రైలుకు గచ్చిబౌలిలో కేటాయించిన 32 ఎకరాల విలువైన భూమిని సీఎం కేసీఆర్ తన ప్రయోజనాల కోసం మైహోమ్స్ రామేశ్వర్‌రావుకు ధారాదత్తం చేయడం వల్లనే వివాదం ఏర్పడిందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గచ్చిబౌలి స్థలానికి బదులుగా నాగోల్‌లోనే భూమి ఇచ్చేందుకు ఎల్ అండ్‌టీకి ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించిన ఎల్‌అండ్‌టీని లక్డీకాపూల్ నుంచి అసెంబ్లీ వరకు, సుల్తాన్‌బజార్ అలైన్‌మెంట్ మార్చాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అలైన్‌మెంట్ మార్చకూడదంటే గచ్చిబౌలి స్థలాన్ని వదులుకోవాలని బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. ఇంతకీ ఎల్ అండ్ టీ తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తుందా... లేకపోతే.. తెలంగాణ ప్రభుత్వాధినేతలే.. తమకు కావలసిన వారి కోసం ఎల్ అండ్ టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: