మెట్రో ప్రాజెక్టు మేం కట్టలేం.. మీరే కట్టుకోండంటూ ఎల్ అండ్ టీ కంపెనీ రాసిన లేఖ తీవ్రదుమారమే లేపింది. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తెలంగాణ ప్రభుత్వం.. ఈ కథనాలతో తీవ్రంగా స్పందించింది. ఉదయం నుంచి ఒకటే హడావిడి.. తెలంగాణ సీఎస్ తో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చర్చలు.. ఆ తర్వాత వీరిద్దరూ కలసి ఎల్ అండ్ టీ సీఈవో గాడ్గిల్ సహా కేసీఆర్ ను కలవడం.. సుదీర్ఘ చర్చ.. అంతా చకచకా జరిగిపోయాయి. కేసీఆర్ తో మీటింగ్ లో ఏం జరిగిందో ఏమో గానీ.. బయటికొచ్చి ప్రెస్ మీట్ పెట్టిన గాడ్గిల్... తెలంగాణ సర్కారు బ్రహ్మాండంగా సహకరిస్తోందన్నారు. లేఖల పరంపరలో కేవలం ఒకదాన్ని తీసుకుని.. దుష్ప్రచారం చేయవద్దని మీడియాకు సూచించారు. మెట్రో ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి, ఎల్ అండ్ టీ యాజమాన్యానికి విభేదాలున్న మాట వాస్తవం. అయితే అవి ప్రాజెక్టు నిలిచిపోయే స్థాయిలో ఉన్నాయా.. లేక.. చిన్నా చితకా విషయాలా అన్నది తేలాల్సి ఉంది. అబ్బే.. ఇలాంటి లేఖలు సహజం అని గాడ్గిల్ చెప్పినా... విషయం అంత చిన్నదిగా కనిపించడంలేదు. పనులు నిలిపేసే ఆలోచన లేదని గాడ్గిల్ మీడియా ముందు చెప్పినా... అనేక విషయాల్లో ఇరు వర్గాలకూ మధ్య తీవ్ర అంతరం ఉందని తెలుస్తోంది. మరోవైపు లేఖలు లీకైన విధానంపై తెలంగాణవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం చంద్రబాబు అనుకూలవైఖరి అవలంభించే ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే.. అదీ ఒకేరోజు లీక్ కావడం వెనుక కుట్ర ఉందని భావిస్తున్నారు. ఎల్ అండ్ టీ కంపెనీకి చంద్రబాబుకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం...హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో అది మరికాస్త బలపడటాన్ని తెలంగాణవాదులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని నిర్మాణం సందర్భంగా అనేక ప్రాజెక్టులు తెరపైకి వస్తాయి కాబట్టి.. వాటిలో ముఖ్యమైనవి కట్టబెడతామని చంద్రబాబు ఎల్ అండ్ టీకి వలవేసి ఉంటారని.. అందుకే పనిగట్టుకుని ఎల్ అండ్ టీ లీకుల వ్యవహారం నడిపిస్తూపైకి మాత్రం అమాయకంగా నటిస్తోందని దేవీప్రసాద్ వంటి తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజానిజాలేంటో నిలకడమీద తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: