విరాళం అనే మాటకే నిర్వచనం మారుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రత్యేకించి చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టాకా విరాళాల గొడవ ఎక్కువైంది. మరి రాజధాని కోసం చేపట్టిన విరాళాల సేకరణ ఎంత వరకూ వచ్చిందో తెలీదు కానీ.. ఇప్పుడు రుణమాఫీ గురించి విరాళాల సేకరణ మొదలైందట. ఇందుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి చెక్కును ఇప్పటికే స్వీకరించాడు కూడా! రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విరాళాల ఖాతా తెరిచారు. ఉత్సాహం, డబ్బు ఉన్న వారు వెళ్లి ఆ ఖాతాలోకి డబ్బు జమచేయవచ్చని తెలుస్తోంది. మరి ఎన్నికల హామీ అమలు గురించి విరాళాలు సేకరిస్తున్న ఏకైక ప్రభుత్వంగా మాత్రం ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ కొత్త రికార్డును స్థాపిస్తోందని అనుకోవాల్సి వస్తోంది. అయితే ప్రతిదానికీ ఇలా విరాళాలు సేకరించడం మాత్రం కామెడీ కూడా అవుతోంది. రుణమాఫీ అనేది ఏదో బాధితుల సహాయార్థం నిర్వహించే కార్యక్రమం కాదు. లక్షల కోట్ల రూపాయల వ్యవహారంతోముడిపడిన అంశం అది. మరి అలాంటి పని కోసం లక్షల రూపాయల మొత్తం ఏ మూలకు అవుతుంది? అనే సందేహం కూడా వస్తుంది. ఏదో షో చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులతో ఎంత ఇబ్బందులు పడుతోందో చెప్పుకోవడానికి తప్ప ఈ విరాళా హైడ్రామా మరెందుకూ ఉపయోగపడదని అనుకోవచ్చు. తాను అధికారంలోకి వస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ విధంగా విరాళాల మీద ఆధారపడటం కూడా విడ్డూరంగానే ఉంది. అలాగే రాజధాని నిర్మాణం కోసం చేసిన విరాళాల సేకరణ గురించి ప్రభుత్వం సమాచారం ఏదీ ఇవ్వడం లేదు.మొదట్లో హడావుడి చేసిన మీడియా కూడా ఇప్పుడు ఆ విరాళాల గురించి మాట్లాడటం లేదు. ఎంత మొత్తం వసూలు అయ్యింది.. దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారో చెప్పడం లేదు. మరి ఇప్పుడు రుణమాఫీ గురించి గారడీ మొదలు పెట్టారు. ఇది ఎన్ని రోజులో..!

మరింత సమాచారం తెలుసుకోండి: