కోనసీమ సరిహద్దులు చెరుగుతున్నాయి. ఉప్పునీటిసీమగా మారుతోంది. భూమి కుంగిపోయి సముద్రతీరం కోతకు గురుఅవుతోంది. మూడేళ్ళ క్రితం భూగర్బ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ముంచుకొస్తున్న ముప్పుపై వాస్తవాలు వెల్లడించినా .. పంటపొలాలను కాపాడటానికి చర్యలు తీసుకోవడం లేదు. పచ్చదనం పరుచుకునే సౌందర్య సీమ.. కోనసీమ కడలి కౌగిలిలోకి చేరిపోతుందా అన్నట్టుగా మార్పులకు గురి అవుతోంది. పచ్చని పంట పొలాలు భవిష్యత్తులో చూడలేమా అన్నంతగా ముప్పు ముంచుకొస్తోంది. అవును కోనసీమ పంట పొలాలను ఉప్పు నీరు ముంచెత్తుతోంది. సముద్రపు నీరు డ్రెయిన్ల ద్వారా ప్రవహించి ఊళ్ళ మీదకు, పంట పొలాలకు చేరుతోంది. బంగారం పండే నేలలు ఉప్పు నేలగా, చౌడు భూములుగా మారుతున్నాయి. ఆరు మండలాల్లోని 18 మధ్యతరహా డ్రెయిన్లు ద్వారా 70 వేల ఎకరాల్లోని పంట పొలాలను సముద్రపు నీరు కప్పేస్తోంది. ఇప్పటికే వేల ఎకరాలను, ఉప్పునీరు నాశనం చేసింది. ఇంకొందరు రైతులు ఖరీఫ్‌పై ఆశలు వదులుకుని.. రబీని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు అది కూడా ఆశాజనకంగా లేకపోవడంతో, తలెత్తుక తిరిగిన రైతన్న దిగాలు పడుతున్నాడు. అన్నపూర్ణగా ఉన్న కోనసీమలో క్రాప్‌ హాలిడేలు పెరుగుతున్నాయి. చేపల చెరువులుగా మారుతున్నాయి. కోనసీమలో గ్యాస్ నిక్షేపాలు వెలికి తీయడంతో భూమి కుంగిపోయి.. తీరం కోతకు గురి అవుతోంది. దీంతో డ్రయిన్ల ద్వారా సముద్రపు నీరు పొలాల్లోకి చేరుతుంది. డెల్టా పరిరక్షణ సమితి ఆద్వర్యంలో భూగర్బ శాస్త్ర వేత్తలు కోనసీమలో పర్యటించి ఉప్పు నీటి సమస్య తీవ్రతను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు కూడా సమర్పించారు. ప్రభుత్వాలు మారుతున్నారు. నాయకులు వస్తున్నారు. అయినా కోనసీమలోని రైతన్నకు న్యాయం జరగడం లేదు. కళ్ళ ముందే పచ్చని పంట పొలాలు నాశనమవుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని సముద్రపు నీరు ప్రవహించే డ్రెయిన్ లకు ఆటో మేటిక్ షటర్లు అమర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే భవిష్యత్ లో కోనసీమలో వరి పంట చాలా వరకు కనుమరుగైనా ఆశ్చర్య పోనవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: