విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్) లభించే అవకాశాలపై అయోమయం నెలకొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి, మొత్తం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించి బిల్లులో ప్రస్తావన ఉన్నప్పటికీ స్పష్టత మాత్రం కనిపించలేదు. నిర్ణయం మాదిరిగా కాకుండా కేవలం ఒక హామీగా మాత్రమే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు కేంద్రంలో ఆర్ధిక పరిస్థితులు, భిన్న వాదనలు పెరగడంతో ప్రత్యేక హోదాపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. వాస్తవంగా మూడు నెలలుగా ప్రత్యేక హోదా వస్తుందని, తద్వారా వేల కోట్ల అభివృద్ధికి బీజం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెంచుకుంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం, తమకు కూడా హోదా కావాలంటూ డిమాండ్ చేయడంతో ఆంధ్రకు హోదా ఇచ్చే విషయంలో కేంద్రం పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇదే భావాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవంగా దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తున్నారు. అందులో ఈశాన్య రాష్ట్రాలే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రకు కూడా హోదా కల్పిస్తే మన రాష్ట్రం 12వ రాష్ట్రంగా ఉంటుంది. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్ర ప్రణాళికా వ్యయంలో ఆ రాష్ట్రాలకు అందించే 30 శాతం నిధుల్లో కొంత ఆంధ్రకూ దక్కుతుంది. అలాగే కేంద్రం వివిధ రాష్ట్రాలకు ఇచ్చే రుణంలో 90శాతం గ్రాంటుగా, పది శాతం రుణంగా మారుతుంది. ఇది కూడా భారీగా నిధులు వచ్చేందుకు ఆస్కారం కలుగుతుంది. అందుకే ప్రత్యేక హోదాపై రాష్ట్రం భారీగా ఆశలు పెంచుకుంటోంది. ఇదే సమయంలో తమిళనాడు, బీహార్ వంటి రాష్ట్రాలూ తమకూ ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ లేవనెత్తుతున్నాయి. ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తే పారిశ్రామికంగా తాము దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్న వాదనను తమిళనాడు తెరపైకి తెస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రం విభజనతో ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌తో పోటీకి రావడం సరికాదన్న భావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేంద్రం ఆలోచన మరోలా ఉందని అంటున్నారు. ఇలా ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అందించే ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు మాత్రం వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికోసం ఇప్పటికే 24,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా, అందులో కనీసం 15నుంచి 20 వేల కోట్లయినా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. దీనిపై బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు కూడా ప్రతిపాదనలపై వివరణ ఇవ్వడం విశేషం. సమావేశంలో సానుకూల వాతావరణం కనిపించిందని ఆర్ధిక శాఖ అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: