ఒక వ్యక్తి స్వతంత్రాన్ని దెబ్బతీయడం, తనను నిర్భందించడం... అనేది ఎంత పెద్ద నేరమో అమెరికా వ్యవస్థలను చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అనుమానాలతో... అక్రమంగా ఒక వ్యక్తిని ఒక గదికి పరిమితం చేయడం కూడా అక్కడ పెద్ద నేరమే. చేసింది పోలీసులే అయినా శిక్ష తప్పదు. తాజాగా న్యూయార్క్ పరిధిలో ఒక భారతీయ బాలిక కు సంబంధించిన వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. తనను న్యూయార్క్ పోలీసులు అక్రమంగా 24 గంటల పాటు తన గదిలో నిర్భందించారని.. తనపై ఏవో అనుమానాలతో విచారణ అంటూ బయటకు కదలనీయలేదని.. ఇది తన స్వేచ్ఛను దెబ్బతీయడమే అంటూ భారతి సంతతికి చెందిన ఒక బాలిక కోర్టులో పిటిషన్ వేసింది. న్యూయార్క్ పోలీసులు తనను ఆ విధంగా ఇబ్బంది పెట్టారని ఆమె కోర్టులో న్యాయపోరాటం మొదలు పెట్టింది. మరి పోలీసులు ఆమెపై అనుమానంతో నిర్భందించింది ఎక్కడో కాదు, ఆమె రూమ్ లోనే.. ఎంతో సేపు కాదు.. ఒక రోజు మాత్రమే! మన దేశంలో అయితే ఇలాంటి అసలు నేరాలే కాదు. మన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని.. తామే దైవదూతలం అయినట్టుగా వ్యవహరించినా.. చేయి చేసుకొన్నా ఎవరూ అడ్డు చెప్పేవారుండరు. అయితే అమెరికాలో మాత్రం ఒక్కోసారి పౌరహక్కులే పరమావధి అవుతుంటాయి. ఈ బాలిక విషయంలో కూడా అదే జరిగింది. తనను నిర్భందించినందుకు గానూ 9 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆమె పిటిషన్ వేసింది. న్యాయం ఆమె వైపే మొగ్గు చూపడంతో పోలీసులు రాజీకి వచ్చారు. తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించలేమంటూ 1.37 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: