తన కుటుంబ సభ్యుల ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్ర బాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. వరుసగా నాల్గొవసారి తన ఆస్తులను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎథిక్స్‌ కమిటీకి ఆస్తుల వివరాలను అందజేస్తామన్నారు. జవాబుదారీతనంతో వుండా లన్న ఉద్దేశంతో తన పిల్లల ఆస్తులు కూడా ప్రకటిం చానన్నారు. గతేడాదితో పోలిస్తే బ్యాంకు బ్యాలెన్స్‌ కొద్దిగా పెరిగిందన్నారు. తన భార్య పేరిట వున్న పిఎఫ్‌, బంగారం కొద్దిగా పెరిగిందన్నారు. నిర్వహణ హోల్డింగ్స్‌ ఆస్తులు రూ.95 లక్షలు పెరిగినట్లు చంద్ర బాబు వివరించారు. మొత్తంగా ఆదాయం రూ.3 కోట్ల మేరకు తగ్గింది. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను ఆయన పత్రికల వారికి విడుదల చేశారు. చంద్ర బాబు నాయుడు వ్యక్తిగత ఆస్తి రూ.70.69 లక్షలుగా వుంది. ఆయన సతీమణి భువనేశ్వరి వ్యక్తిగత ఆస్తి రూ.46.88 కోట్లు, కుమారుడు లోకేష్‌ వ్యక్తిగత ఆస్తి రూ.11.04 కోట్లు కాగా, కోడలు బ్రహ్మణి ఆస్తి రూ.5.32 కోట్లుగా చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.45.90 లక్షలు వుంది. జూబ్లీహిల్స్‌లో ఇంటి విలువ రూ.23.02 లక్షలు అని, ఒక అంబాసిడర్‌ కారు వుందని, దాని విలువ రూ.1.52 లక్షలు అని ఆయన పేర్కొన్నారు. అప్పులు కూడా చాలానే వున్నాయి. భువనేశ్వరికి వ్యక్తిగత ఆస్తులు రూ.46.88 కోట్లు కాగా, అందులో అప్పులు రూ.16.28 కోట్లు వున్నాయి. లోకేష్‌కు రూ.4.47కోట్ల మేరకు అప్పులు, బ్రహ్మణికి రూ.1.37కోట్ల మేరకు అప్పులు వున్నట్లు చంద్రబాబు తెలిపారు. నిర్వహణ సంస్థకు రూ.25.25కోట్ల మేరకు అప్పులు వున్నాయి. కుటుంబానికి ఏదో ఒక ఆధారం వుండాలనే ఉద్దేశంతోనే హెరిటేజ్‌ను ప్రారంభించామని, కార్పొరేట్‌ నిబంధనలకు అనుగుణంగా అది నడుస్తోందన్నారు. హెరిటేజ్‌ టర్నోవర్‌ రూ.1722 కోట్లు కాగా, నికర లాభం రూ.45.31కోట్లు. అలాగే ఈ సంస్థకు నికర ఆస్తులు రూ.282.60 కోట్లు కాగా, అప్పులు 132.16 కోట్ల మేరకు వున్నాయి. గతేడాదితో పోలీస్తే రూ.7.51శాతం టర్నోవర్‌ హెరిటేజ్‌లో పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: