నెల్లూరుజిల్లాలో రాజకీయ సందడే లేకుండాపోయింది. మంత్రులు రావడం, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అధికారులతో సమీక్షలు, ఆకస్మిక తనిఖీల వంటి హడావిడే లేదు. దీనికి కారణం జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకుడికి మంత్రి పదవి రాకపోవడమే. ఈ జిల్లాకు చెందిన విద్యావేత్త పి.నారాయనకు మంత్రి పదవి వచ్చింది. స్వతహాగా ఆయన రాజకీయ నాయకుడు కాదు. అందుకనే మంత్రిగా ఆ డాబు, దర్పం ప్రదర్శించలేకపోతున్నాడు. ఒక్కో జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. నెల్లూరుజిల్లా నుండి మంత్రిగా నారాయణ ఉన్నారు. ఇంతకుముందు ఏ మంత్రి అయినా తన సొంత జిల్లాకు నెలకొకసారన్నా వచ్చి పోతుండేవాడు. కాని నారాయణకు మాత్రం ఆ తీరిక లేకుండాపోయింది. చంద్రబాబుకు ఆయనే నమ్మినబంటు. కాబట్టి రాజధాని పరిశీలన కమిటీతో పాటు భూసేకరణ కమిటీ, ఋణమాఫీ కమిటీ... ఇలా అన్నిరకాల కమిటీలలో నారాయణను వేస్తున్నాడు. అంతేకాకుండా రాజధానిని ఏ విధంగా నిర్మించాలనే దానిపై అధ్యయనం చేసేందుకు నారాయణనే దేశవిదేశాలకు తిప్పుతున్నారు. ఇంతకుముందు అప్పుడప్పుడన్నా తన విద్యాసంస్థల పనిమీద నెల్లూరొచ్చే నారాయణ, మంత్రి అయ్యాక ఆ మాత్రం కూడా రాలేకపోతున్నాడు. నారాయణతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నాయకుడికి మంత్రి పదవి వచ్చివుంటే జిల్లాలలో సందడి ఇంకో విధంగా వుఁడేది. గతంలో చంద్రబాబు కేబినెట్ లోనే సోమిరెడ్డి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. మంత్రి పవర్ ఎలా ఉంటుందో చూపించాడు. సోమిరెడ్డి నెల్లూరొచ్చాడంటే జిల్లా అధికారయంత్రాంగమంతా ఆయన చుట్టే తిరిగేది. కార్యకర్తలు, ప్రజల పనులు అప్పుడే అయిపోతుండేవి. ఈరోజు సోమిరెడ్డికి మంత్రి పదవి లేకున్నా ఆయన ఆఫీసు వద్ద జనం క్యూలు కడుతున్నారంటే కారణం గతంలో మంత్రిగా ఆయన ఆ విధంగా పనిచేసి ఉండబట్టే. ఒక్క సోమిరెడ్డే కాదు గతంలో జిల్లా నుండి మంత్రులుగా పనిచేసిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆనం సంజీవరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు మంత్రులుగా జిల్లాను ఒక ఊపు ఊపినవారే. ఇప్పుడ మాత్రం జిల్లాలో ఆ ఊపు, హుషార కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: