జన్మభూమి.. మామకు వెన్నుపోటు పొడిచిన అల్లుడిగా సీఎం కుర్చీ ఎక్కిన తొలినాళ్లో చంద్రబాబుకు పేరు తెచ్చిన పథకం.. ఎన్టీఆర్ అల్లుడిగా కాక.. చంద్రబాబునాయుడుగా ఆయనకు సొంత ఇమేజ్ తెచ్చిన కార్యక్రమం. బాబు అనుకూల మీడియా పుణ్యమా అని రాష్ట్రమంతటా ఓ ఊపు ఊపిన కార్యక్రమం. కొరియా స్ఫూర్తితో ప్రారంభమై.. తెలుగు నేలతో చైతన్యం నింపి.. ఆ తర్వాత కాంట్రాక్టర్లు, తెదేపా కార్యకర్తల జేబులు నింపేందుకే పరిమితమైన కార్యక్రమం. ఉద్యమంలా ప్రారంభమైనా.. చివరకు ఉస్సూరనిపించేలా తయారైంది. ఎంతలా అంటే.. ఇప్పటికీ చంద్రబాబు ఏదైనా కార్యక్రమలంలో మాట్లాడిన తర్వాత చివరకు స్లోగన్.. జై తెలుగుదేశం.. జై జన్మభూమి అనే అంటుంటారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో... ఈ కార్యక్రమం మరోసారి తెరపైకి వచ్చింది. పాత జన్మభూమికి కొన్ని మార్పులు చేసి.. మళ్లీ అమలు చేయబోతున్నారు. గతంలో ప్రజలందిరితో శ్రమదానం చేయించిన చంద్రబాబు.. ఈసారి.. గ్రామాల నుంచి పైకెదిగిన వారి సహకారంతో పల్లెటూళ్లను బాగుచేస్తానంటున్నారు. ఇటీవల ప్రజల్లో సొంత గ్రామాలపై ప్రేమ పెరుగుతోంది. ఎక్కడ నివసిస్తున్నా.. సొంత గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతున్నారు. పూర్వవిద్యార్థి సమ్మేళనాలూ ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి వారి సహకరంతో.. ప్రభుత్వ నిధులు కొంత మేర జత చేసి గ్రామాల్లో వెలుగులు నింపాలన్నది తాజా ఆలోచన. మొన్నటి ఎన్టీఆర్ సుజల స్రవంతి.. నేటి జన్మభూమి.. ఏదైనా సొమ్ము దాతలది.. పేరు ప్రభుత్వానిది అన్నమాట.. ప్రజల్లో ఉన్న సేవాభావాన్ని ప్రోత్సహించి పల్లెటూళ్లకు మేలు చేసే కార్యక్రమం ఎవరు చేసినా హర్షించాల్సిందే. అంతమంగా పల్లెసీమలు అభివృద్ది బాట పట్టాలి. కాకపోతే.. గతంలో జరిగినట్టు.. జన్మభూమి కార్యక్రమం కేవలం పచ్చచొక్కాల జేబులు నింపేందుకే పరిమితం కాకూడదు. అందులోనూ రాష్ట్రం విడిపోయి... స్వీయ అస్తిత్వం కోసం పోరాడుతున్న సమయంలో.. అలాంటి రాజకీయ లబ్ది కోసం చూడకుండా చిత్తశుద్దితో అమలుచేస్తే మంచి ఫలితాలే ఆశించొచ్చు. లేనిపక్షంలో ఇది మరో వృథా కార్యక్రమంగా మిగిలి.. బాబుకు చెడ్డపేరు తెచ్చే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: