ఇప్పటికే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆదర్శ రైతులపై కూడా పడింది. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు నెలలుగానే చంద్రబాబు ప్రభుత్వం ఆదర్శ రైతులను తొలగించే పని చేపట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచినే వారికి జీతాలు ఇవ్వడం మానేశారు. తద్వారా ఆ వ్యవస్థను రద్దు చేయబోతున్నామనే అభిప్రాయాన్ని కలిగించారు. ఇప్పుడు అధికారికంగా ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మరి బాబు వస్తే జాబు వస్తుందని అనుకొంటే... ఇలా తమ జాబులు కూడా పోవడం పట్ల రైతులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామంలోనూ ఒక ఆదర్శ రైతు ఉంటాడు. వారికి ప్రభుత్వం ప్రోత్సహకంగా కొంత జీతం ఇస్తోంది. అయితే ఇవన్నీ కాంగ్రెస్ వాళ్లే సొంతం చేసుకోన్నారనేది తెలుగుదేశం ఆరోపణ. అందుకే దీన్ని రద్దు చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నట్టుగానే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదర్శ రైతుల వ్యవస్థ మొదలైంది. గ్రామాల్లో చక్కగా వ్యవసాయం చేస్తున్న వారిని ఆదర్శ రైతులుగా ప్రకటిస్తూ.. వారిని ఇతర రైతులకు మార్గదర్శకులు గా చేస్తూ ప్రోత్సహక రుసుమును జీతంగా ఇస్తూ ఈ వ్యవస్థను ఏర్పరిచారు. అయితే ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదంటూ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. మరి వైఎస్ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇదే సమయంలో తమ గత పథకాలను తిరిగి ప్రారంభించే పనిలో పడింది. మళ్లీ జన్మభూమి కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్టుగా ప్రకటించారు. మరి అప్పట్లో ఈ పథకం మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇలాంటి పథకాల వల్లనే చంద్రబాబు 2004లో అధికారాన్ని కోల్పోయారని కూడా విశ్లేషణలు వినిపించాయి. మరి ఇప్పడు బాబు మాత్రం మళ్లీ అదే బాటనే అందుకొంటున్నాడు. ఫలితాలు ఎలా ఉంటాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: