తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వరసగా నాలుగోసారి జనం చెవుల్లో కాలీ ఫ్లవర్ పెట్టేశారు. సారీ.. నాలుగోసారీ తన ఆస్తులు ప్రకటించారు. రెండింటికీ పెద్ద తేడా లేదనుకోండి. కాకపోతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు అధికారపక్షంలో ఉండి ఆస్తుల ప్రకటన చేశారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రహ్మణి, కుటుంబ ట్రస్టు నిర్వాణ హోల్డింగ్స్‌కు మొత్త మీద.... 90 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అంతా ఆదాయమే అనుకునేరు. వీరికి అప్పుడు కూడా ఉన్నాయి. అవి కూడా కాస్త ఘనంగానే ఉన్నాయి.. వీరి మొత్తానికి ఏభై కోట్ల అప్పులు ఉన్నాయి. ఆదాయం, అప్పులు పోను చంద్రబాబు కుటుంబం నికర ఆస్తుల విలువ సుమారు 40 కోట్ల రూపాయలన్న మాట. విశేషం ఏమిటంటే.. ఆయనకు సంబంధించి ఆస్తుల్లో మార్పు పెద్దగా ఏమీ లేదట. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మాత్రం కొద్దిగా పెరిగిందట. దీనిపై ఆయనే సెటైర్ వేశారు. కొందరికి ముఖ్యమంత్రులు అయిన తర్వాత లక్షల కోట్ల ఆదాయం వస్తే నాకు మాత్రం లక్షల్లో ఆదాయం వచ్చిందని చంద్రబాబు చమత్కరించారు. ఐతే చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల విలువలన్నీ మార్కెట్ విలువ ప్రకారం కాకుండా.. తాము ఆ ఆస్తులు కొన్నప్పుడు ఉన్న విలువతో చెప్పడం అప్పుడు.. ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఐతే... తన కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్‌లో 40 శాతం వాటా ఉందంటున్న చంద్రబాబు... అంత తక్కువ ఆస్తులు లెక్క చూపుతున్నారేంటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.810 కోట్లు. మరి అందులో 40 శాతమంటే 324 కోట్లు . కానీ చంద్రబాబు మాత్రం కేవలం 40 కోట్లు మాత్రమే చెబుతున్నారు. ఇక ఈ ఆస్తుల ప్రకటనలో నిజానిజాలేంటో జనం పసిగట్టలేనంత అమాయకులు కారని చెబుతున్నారు. ఏటా.. ఏదో ఒక పువ్వు పెడుతున్నాడని వెటకారంగా అనుకున్నా.. కనీసం ఆ మాత్రమైనా ప్రకటిస్తున్న నాయకుడు చంద్రబాబే కావడం మరో విశేషం. అలా ప్రకటించడం వల్ల కనీసం ఎంతో కొంత మార్పు ఉంటుంది. మీడియాకానీ.. ప్రతిపక్షాలు కానీ.. ప్రశ్నిస్తాయన్న భయంతోనైనా విచ్చలవిడి అవినీతికి ఆస్కారం తగ్గుతుంది. కానీ మిగతా నేతలు అలా కాదే.. దమ్ముంటే నీ ఆస్తుల సంగతిచెప్పు అని సవాల్ చేస్తున్నా మన్నుతిన్న పాముల్లా ఉంటున్నారు తప్పితే.. నోరు విప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: