మన మీడియా వాళ్లు మహా ముదుర్లండోయ్... పొలిటికల్ లీడర్స్ కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. వాళ్లతో తమకు కావాల్సింది చెప్పించేసుకుంటారు. తమకు కావాల్సిన ముక్క నేత నోటి నుంచి బయటపడగానే బ్రేకింగుల పేరుతో నానా హడావిడి చేసేస్తారు. మరి అలాంటప్పడు నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సహనం, సమయస్ఫూర్తి లేకపోతే.. అభాసుపాలవవడమో.. నెగిటివ్ న్యూస్ కు కారణమై పార్టీ అధినేతలతో అక్షింతలు వేయించుకోవడమో తప్పదు. ఇప్పుడు టీడీపీ ఎంపీ సుజానాచౌదరి ఇలాంటి తప్పే చేశారు. విజయవాడలో జరిగిన టీడీపీ ఎంపీల కార్యక్రమం తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో సుజనాచౌదరి మొదట మాట్లాడారు. ఎందుకు మీటింగు పెట్టుకున్నారో వివరించారు. అంతవరకూ బాగానే ఉంది. ఇక మీడియా ప్రతినిధులు ప్రశ్నలు మొదలుపెట్టారు. మీటింగు సంగతి పక్కనపెట్టండి.. అంటూ అందరికీ ఇంట్రస్టింగ్ టాపిక్కైన రాజధాని- భూముల అంశం తెరపైకి తెచ్చారు. సుజనాచౌదరికి అంతగా మీడియా అనుభవం లేకపోవడం, కాస్త సహనం తక్కువ కావడంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంచికచర్లలో పెద్ద ఎత్తున భూములు కొన్నారట కదా.. రాజధాని అక్కడే పెడతారా.. అంటూ ఓ కొంటె విలేకరి ప్రశ్నాస్త్రం సంధించారు. విమర్శ వ్యక్తిగతమయ్యేసరికి సుజనాకు రోషం పొడుచుకొచ్చిందో ఏమో.. ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అవును కొన్నా.. ఐతే ఏంటి.. నా డబ్బులతో నేను కొనుక్కుంటే తప్పేంటి.. అంటూ దబాయించడం మొదలు పెట్టారు సుజనా. అబ్బా.. దొరికాడురా చేతికి అనుకుని.. అదే మూడ్ కంటిన్యూ చేస్తూ మరికొంతసేపు ప్రశ్నలు వేశారు. విలేఖరుల ప్రశ్నలతో సుజనా ఇంకాస్త స్వరం పెంచారు. అన్ని అర్హతలు ఉన్నాయని భావిస్తే రాజధాని కంచికచర్లే అవుతుంది. అంటూ రెండు మూడు సార్లు రెట్టించి చెప్పారు. అంతే కాదు. నా తాత సంపాదించిన డబ్బుంది కొనుక్కుంటున్నా.. అన్నారు. అంతటితో ఆగలేదు.. నువ్వు ఏ ప్రాంతం పేరు చెప్పినా సరే.. అక్కడ నా భూములున్నాయి .. అంటూ కామెంటే చేశారు. అధికార పార్టీలో ఉండి అలా నోరు జారడం కరెక్టు కాదు సుజనా అని చెప్పే ఆస్కారం ఆయన ఎవరికీ ఇవ్వలేదు. సో.. మొత్తానికి కొత్త రాజధాని కంచికచర్ల చుట్టుపక్కల వస్తుందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: