రాజధాని నిర్మాణమంటే మాటలు కాదు.. లక్షల కోట్లు కావాలి. అసలే లోటు బడ్జెట్ తో ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్రానికి అంత ఖర్చు భరించే స్తోమతలేదు. అందులోనూ రాజధానిగా ఎంచుకున్నది ఖరీదైన విజయవాడ పరిసర ప్రాంతాలను. మరి భూసేకరణ ఎలా.. ఇప్పుడు ఇదే చంద్రబాబు సర్కార్ ముందున్న అతిపెద్ద సవాల్. అసలే రాజధాని ప్రచారంతో బెజవాడ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సమస్యను గుర్తించి చంద్రబాబు ఓ ప్లాన్ రూపొందించారు. అదే భూములు సేకరించి.. అభివృద్ధి చేసి.. 60-40 నిష్పత్తిలో పంచుకోవడం. పైకి చెప్పడానికి బాగానే ఉన్నా.. ఈ ప్లాన్ అంతగా వర్క్ ఔట్ అయ్యేట్టులేదు. వాస్తవానికి చంద్రబాబు ఐడియా థియరీటికల్ గా ఓకే.. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి రైతులను కన్విన్స్ చేయలేకపోతోంది. అందుకు ప్రధాన కారణం సర్కారు దగ్గర నిధులు లేకపోవడమే. ఎప్పుడు భూములు సేకరించాలి.. ఎప్పుడు అభివృద్ధి చేయాలి.. ఎప్పుడు ఆ 60 శాతమో.. 40 శాతమో అమ్ముకోవాలి.. ఈ ప్రక్రియలో చాలా సహనం అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. రియల్ ఎస్టేట్ భూమ్ నేపథ్యంలో.. అంత ఓపిక ఎవరికీ లేదు. ఇవాళ మాట్లాడుకోని రేపు నెట్ క్యాష్ ఇచ్చేస్తున్న సమయంలో..ఈ సర్కారీ వ్యవహారం వైపు రైతులు మొగ్గుచూపడం లేదట. కానీ చంద్రబాబు ప్రధానంగా ఈ 60-40 విధానంపైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే రైతులను ఆకట్టుకునేందుకు మరిన్ని వెసులుబాట్లు ప్రకటిస్తున్నారు. ఐతే.. ఎన్ని ఆకట్టుకునే ప్రకటనలు చేసినా... రైతులు మాత్రం పెద్గగా ముందుకు రావడం లేదు. ఇది బాబు సర్కారుకు ఇబ్బందికరంగా మారుతోంది. రైతులు ఇలాగే వ్యవహరిస్తే... బలవంతంగా భూసేకరణ చేయకతప్పదు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉన్నా.. అది ప్రజల్లో వ్యతిరేకత తెస్తుంది. సాఫీగా జరిగిపోవాల్సిన పని వివాదాస్పదమవుతుంది. మరి బాబు ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: