మీడియాను ఆకట్టుకునేలా మాట్లాడే ఏపీ నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. ఆయన రాయలసీమ యాస.. మాట చెప్పే విధానం.. డైలాగ్ డెలివరీ.. చూసేవారిని ఆకట్టుకుంటాయి. అందుకే మీడియా ప్రతినిథులు ఆయన వెంటపడి మరీ ఏదో ఒక సంచలం రాబట్టాలని ప్రయత్నిస్తారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలోనూ అదే జరిగింది. ఈ మధ్య జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్న జేసీ.. శనివారం మరింతగా రెచ్చిపోయారు. ఏది మాట్లాడితే మీడియా హైలెట్ చేస్తుందో తెలుసు కాబట్టి.. అదే స్టైల్లో రెచ్చిపోయారు. ఆరు నెలల్లో జగన్ పార్టీ మాయమవుతుందనేది జేసీ చెబుతున్న తాజా జోస్యం. అందుకు ఆయన చెబుతున్న రీజనింగ్ కూడా ఆలోచింప చేసేలానే ఉంది. జగన్ పై పన్నెండు వరకూ చార్జిషీట్లు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దాంట్లో అయినా నేరాలు రుజువు కావడం ఖాయమని జేసీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అదే నిజమైతే జగన్ మరోసారి జైలు జీవితం గడపడం ఖాయం. మరి జగన్ మళ్లీ జైల్లోకి వెళ్తే.. పార్టీని నడిపేది ఎవరు.. అందులోనూ గతంలో అంటే ఎన్నికలు ముందున్నాయి కాబట్టి.. అధికారం దక్కవచ్చనే ఆశలు ఉన్నాయి. రాజకీయనేతలపై ఉన్న నేరాలపై సత్వరమే విచారణ చేయాలని కేంద్రం కూడా తాజాగా ఆదేశించింది. దీని ఫలితంగా జగన్ మరోసారి జైలుకెళ్తే.. ఆ పార్టీ మనుగడ కష్టతరమవుతుంది. జగన్ ఆధ్వర్యంలో పార్టీ నడుస్తున్నప్పుడే... పార్టీ తరపున గెలిచిన ఎంపీలు కూడా పార్టీ విడిచివెళ్లిపోతున్నారు. శనివారం టీడీపీ ఎంపీల మీటింగ్ కు హాజరైన కొత్తపల్లిగీత టీడీపీ ఎంపీలాగానే వ్యవహరించారు. మరి అలాంటిది జగన్ జైలుకెళ్తే ఆ పార్టీ బతికి బట్టగలుగుతుందా.. ఐదేళ్ల పాటు కష్టాలు తట్టుకుని.. నిలబడగలుగుతుందా.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. జగన్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే... జేసీ జోస్యం నిజం కావడం ఖాయం

మరింత సమాచారం తెలుసుకోండి: