ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలసి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సొంతంగా బలపడేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు రాష్టవ్య్రాప్తంగా సొంత పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహిస్తోంది. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో జరిగిన పార్టీ విసృ్తత స్థాయి సమావేశంలో నేతలు ఈమేరకు నిర్ణయించారు. ఈ సందర్భంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అనుచరులు దాదాపు 400 మంది బిజెపిలో చేరారు.పార్టీ బలంగా ఉంటేనే భవిష్యత్తులో జరుగనున్న ఏ ఎన్నికలలోనైనా విజయం సాధించవచ్చనీ, ఇందు కోసం ముందుగా పార్టీ కేడర్‌ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉన్నందున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రజా, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు అవసరమైతే పార్టీ కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలనీ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వీరికి లబ్ది చేకూర్చాలని సైతం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపితో కలసి బిజెపి అధికారాన్ని పంచుకుంటోంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులకు మంత్రులుగా అవకాశం ఇచ్చింది. దీనిని ఆసరాగా తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పార్టీని పటిష్టంగా తీర్చి దిద్దాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పలు సందర్భాలలో పార్టీ నేతలకు సూచించడం ఈ సందర్భంగా గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: