టీడీపీ తెలంగాణ నేతలకూ, టీఆర్ఎస్ నేతలకు రోజురోజుకూ మాటల యుద్ధం ముదురుతోంది. మాటలయుద్ధం స్థాయిని దాటి సవాళ్ల రేంజ్ కు చేరింది. ప్రత్యేకించి టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై రోజూ ప్రెస్ మీట్ పెట్టి ఏకేస్తున్నాడు. అందులోనూ మైహోం గ్రూపు అధినేత రామేశ్వరరావు - కేసీఆర్ సంబంధాలను టార్గెట్ చేస్తూ ఆసక్తికరమైన చర్చకు దారి తీశాడు. మొదట్లో ... టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోనే మైహోం గ్రూపు భూ కేటాయింపుల ఫైలు చకచకా కదిలిందని.. ఆరోపించిన రేవంత్.. ఆ తర్వాత.. మరికొన్ని కొత్త విషయాలను బయటపెడుతున్నాడు. రాయదుర్గం భూములను మైహోంగ్రూపునకు బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి ప్రశ్నించిన రేవంత్... మరి గేమింగ్ సిటీ సంగతి ఏమైందని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి సంబంధించిన ఫైళ్లన్నీ అఖిలపక్షం ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ అంశంపై దమ్ముంటే ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రోజూ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా స్వరం పెంచారు. రేవంత్ పై విమర్సలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రాకు తరలించుకుపోయేందుకే చంద్రబాబు రేవంత్ రెడ్డితో పసలేని విమర్శలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ సవాల్ కు స్పందించిన జూపల్లికృష్ణారావు, జితేందర్ రెడ్డి తదితరులు... ఎక్కడైనా చర్చకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని తెలిపారు. రేవంత్ కోరుకున్నచోటే చర్చకు తాము సిద్దమని ప్రకటించారు. అంతేకాదు... రేవంత్ ఆరోపణలు తప్పని తేలితే.. రేవంత్ గుండు కొట్టించుకుంటాడా అని ప్రశ్నించారు. మరో కార్యక్రమంలో హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి కూడా రేవంత్ పై విరుచుకుపడ్డారు. రేవంత్ ఓ బచ్చా అంటూ దుయ్యబట్టారు. పనిగట్టుకుని చంద్రబాబు కేసీఆర్ పై మాటల దాడికి రేవంత్ ను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: