పరిపాలనలో సాంకేతికత వాడటం వల్ల ప్రజలకు మేలు జరగాలి. ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టాలి. కానీ అదే సాంకేతికను సరిగ్గా వాడుకోకపోతే.. అందరికీ చిక్కులే. గత యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన నగదు బదిలీ పథకం ఇందుకు ఉదాహరణ. ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ ధనం నేరుగా వారి జేబులోకే వెళ్లాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం ప్రారంభించినా దాని ఫలితాలు మాత్రం ప్రజలకు నరకం చూపాయి. ముఖ్యంగా వంటగ్యాస్ సబ్సిడీకి ఈ నగదు బదిలీ వర్తింపజేయడం వల్ల సామాన్యులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దుర్వినియోగాన్ని అరికట్టడం సంగతి అటుంచి.. మెజారిటీ లబ్దిదారులను ఈ పథకం ఆగ్రహానికి గురి చేసింది. యూపీఏ ఘోరంగా ఓడిపోయేందుకు ఈ కోపం కూడా ఓ కారణం. ప్రజాగ్రహాన్ని గమనించిన యూపీఏ ఎన్నికల ముందు గ్యాస్ నగదు బదిలీని ఆపేసినా.. అప్పటికే కడుపు మండిన జనం ఓట్లతో బుద్ది చెప్పారు. ఇంత జరిగాక కూడా మళ్లీ మోడీ నగదు బదిలీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించారు. వచ్చే జనవరి లేదా ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం అమలు చేయాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే అందరికీ బ్యాంకు ఖాతాలంటూ జన్ ధన్ యోజన ప్రారంభించారు. మొదట వంట గ్యాస్, కిరోసిన్ లతో నగదు బదిలీ ప్రారంభిస్తారట. మరి యూపీఏ హయాంలో జరిగినట్టుగానే తప్పులతడకగా ఈ నగదు బదిలీ జరిగితే.. మోడీ సర్కారుపై వ్యతిరేకత పెరగడం ఖాయం. ఇప్పటికే ఉపఎన్నికలతో తల బొప్పి కట్టిన మోడీ ఇకనైనా జాగ్రత్తపడటం మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: