2జీ స్కామ్ తో సహా యూపీఏ హయాంలో జరిగి వెలుగులోకి వచ్చిన స్కాములతో జరిగిన నష్టం గురించి అంచనాలను వెలువరించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ (కాగ్) మా పార్టీ ఓటమికి ప్రధాన కారణం అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు! కుంభకోణాల వల్ల జరిగిన నష్టం గురించి కాగ్ భారీ భారీ ఫిగర్ లను వెల్లడించింది. లక్షల కోట్లల్లో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని అభిప్రాయపడింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే కాగ్ ఈ విషయాలను వెల్లడించింది. మరి ఆ ప్రభుత్వ హయాంలో ఒక ప్రభుత్వ బద్ధమైన సంస్థ ఇలాంటి ప్రకటన చేయడం యూపీఏకి పెను ప్రమాదంగా మారింది. తీవ్రమైన ప్రజావ్యతిరేకతను పెంచింది. ఒకరకంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు కూడా నిజమే. యూపీఏ హయాంలో వెల్లడైన కాగ్ నివేదికలే వాళ్ల పార్టీ ప్రాణాలు తీశాయి. 2జీ స్కామ్ విలువ లక్ష కోట్ల పైమాటే అని కాగ్ వెల్లడించింది. దేశ చరిత్రలోనే అది అతి భారీ స్కామ్ గా పేరు తెచ్చుకొంది. అయితే తమ డ్యూటీ తాము చేశామని అంటున్నారు నాటి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్. తమ నివేదికల వల్లనే కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఓటమి ఎదురైందన్న వాదనను కొట్టి పడేశాడు. తాము జరిగిన నష్టం గురించిని నివేదికలను మాత్రమే ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతల మాటల్లో కొంత వితాండవాదం కూడా ఉంది. స్కాములు బయటకు రావడం వాటి వల్ల జరిగిన నష్టం ఎంతో ప్రజలకు తెలియడం వల్లనే తాము ఓడిపోయామని వారు చెబుతున్నారు. అంటే అవి బయటకు రాకుండా ఉండుంటే... జరిగిన నష్టం గురించి ప్రజలకు తెలియకపోతే... బావుండు.. అనే ఆశలను వారు పరోక్షంగా వెల్లడిస్తున్నారు. తాము స్కాములు చేయలేదు అనడం లేదు వాళ్లు.. ఆ స్కాములు వెలుగు చూడటం వల్లనే ఓటమి పాలయ్యామని అంటున్నారు. మరి ఈ రకంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం న్యాయమే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: