ఇంటికో ఉద్యోగం... తెలుగుదేశం ఎన్నికల హామీ. మరి ఎన్నికలు అయిపోయాకాఆ పార్టీ ఆ నినాదాన్ని దాదాపుగా మరిచిపోయినట్టుగానే ఉంది. తెలుగుదేశం అధినేత ఇంటికో ఉద్యోగం ఇస్తానని అప్పట్లో హామీ ఇస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు దాన్ని తప్పు పట్టారు. ఏపీలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో మీకు తెలుసా? అని వారు ప్రశ్నించారు. అయితే చంద్రబాబు అప్పట్లో అలాంటి వాదనలకు విలువనివ్వలేదు! తాము చేసి చూపిస్తాం అని అన్నారు. అయితే టీడీపీ నేతలు ఇప్పుడు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. తాజాగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేసిన ప్రకటన అలాగే ఉంది! మొత్తం ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని... ఆయన హామీ ఇచ్చాడు. మరి అది ఎన్నటికి సాధ్యం అవుతుందో కానీ... టీడీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే వంద రోజులు గడిచిపోయాయి. ఈ వంద రోజుల్లో చేసింది ఏమీ లేదు! విభజన వల్ల సమస్యలు.. అంటూ సాకులు చెబుతూ తప్పించుకోవడం... మరో వైపు హామీలు గుప్పించడం ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు. ఎక్కడైనా నిలదీతలు ఎదురైతే... అప్పుడు విభజన, పర్యవసనంగా సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ హామీలు ఇచ్చే సమయాల్లో మాత్రం వారికి ఆ సమస్యలు ఏమీ గుర్తుకు రావు. ప్రజలను త్రిశంకు స్వర్గంలోకి తీసుకెళ్లినట్టుగా హామీలు ఇస్తారు. ఉద్యోగాల కల్పన అనేది కేవలం పేపర్ వర్క్ అని అనుకొంటున్నారో ఏమోకానీ మంత్రిగారు ఏకంగా ఐదులక్షల ఉద్యోగాలు... అంటున్నారు. రాష్ట్రాన్ని మొత్తం ఐటీ కారిడార్ గా మార్చేస్తామని అంటున్నారు. రాజకీయ నేతలు ఎవరైనా ఎన్నికల ముందు హామీలు ఇస్తారు కానీ... ఇలా ఎన్నికల తర్వాత కూడా హామీలు ఇస్తున్న ఘనత మాత్రం టీడీపీ నేతలదే అవుతుంది. మరి ఇలా ఎన్ని రోజులు గడుపుతారో!

మరింత సమాచారం తెలుసుకోండి: