విజయవాడ చుట్టుపక్కలే నవ్యాంధ్ర రాజధాని అని ప్రకటించిన నాటి నుంచి రియల్టర్లు, బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. అసలు సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభం నుంచి బెజవాడ-గుంటూరు మధ్య రియల్ ఎస్టేట్ భూమ్ మొదలైంది. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఈ జోరు ఇంకాస్త పెరిగింది. ఈ భూమ్ ను సొమ్ము చేసుకునేందుకు కొందరు మాయగాళ్లు బయలుదేరారు. భూయజమానులు, కొనుగోలుదారులు వీరి మాయలో పడి కోట్లకు కోట్లు సమర్పించుకుంటున్నారు. బెజవాడ భూ మాయగాళ్లు రకరకాలుగా ఉన్నారు. కొందరు మధ్యవర్తిత్వం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఒకే భూమిని నలుగురైదుగురు కొనుగోలుదార్లకు చూపించి.. వారి మధ్య కృత్రిమ పోటీ పెంచి.. అమాంతం రేటు పెంచే బాపతు ఒకటి. ప్రస్తుతం వీరి హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. ఓవైపు వీజీఎంటీ పరిధిలో రిజిస్ట్రేషన్లు నిలిపేశామని సర్కారు చెబుతున్నా వీరి హడావిడి మాత్రం తగ్గలేదు. భూ యజమానికి వద్ద ఓ రేటు కు ఒప్పందం కుదుర్చుకుని.. వీరు మాత్రం పార్టీకి అంతకంటే ఎక్కువ రేటు చెబుతూ.. ఆ మిగిలిన మొత్తం తమ జేబులో వేసుకుంటున్నారు. మరికొందరు.. సర్కారులోని బడానేతల పేరు చెప్పి.. అదిగో ఆయన అక్కడ ఇన్ని వందల ఎకరాలు కొన్నాడు.. అక్కడ ఫలానా కార్యాలయం రాబోతోంది.. అని అరచేతిలో వైకుంఠం చూపించి రేట్లు పెంచేస్తున్నారు. మరికొందరు.. తమకు సర్కారులో ఫలానా అధికారులు తెలుసు.. మాకు కచ్చితమైన ఇన్ ఫర్మేషన్ ఉంది. అక్కడ ఆయా సంస్థలు వస్తున్నాయ్..అంటూ మాయ చేస్తున్నారు. రాజధాని అంటే అభివృద్ధి సహజమే.. దాని ఫలాలు అందుకోవాలనుకోవడమూ సహజమే కానీ... సరైన జాగ్రత్త వహించకపోతే.. ఈ లావాదేవీల్లో సాంతం మునిగిపోయే ప్రమాదముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: