హైదరాబాద్ పాతబస్తీని కొత్త నగరంతో అనుసంధానించే మెట్రో -2 కారిడార్ పై రాజకీయ మబ్బులు కమ్ముకున్నాయి. ఫలక్ నుమా నుంచి జేబీఎస్ వరకూ నిర్మించనున్న ఈ మార్గంపై మజ్లిస్ పార్టీ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అలైన్ మెంట్ మార్చాల్సిందేనని పట్టుబడుతోంది. ఇప్పటికే అసెంబ్లీ, సుల్తాన్ బజార్ రూట్లో తెలంగాణ సర్కార్ మార్గాన్ని మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో తమ విజ్ఞప్తులనూ పరిగణలోకి తీసుకోవాల్సిందేనని మజ్లిస్ వాదిస్తోంది. మజ్లిస్, టీఆర్ఎస్ దోస్తీ నేపథ్యంలో మెట్రో-2 ప్రాజెక్టుపైనా వివాదం తప్పదేమోననిపిస్తోంది. పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్ మెంట్ నేపథ్యంలో భారీగా భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనిపై మజ్లిస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మిగిలిన కేరిడార్లలో పనులు పూర్తవుతున్న నేపథ్యంలో కారిడార్ -2లోనూ రైట్ ఆఫ్ వే అప్పగించాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై పెరుగుతోంది. 2017 జూన్ నాటికి ఈ కారిడార్ నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. దీన్ని సాధించాలంటే వెంటనే తమకు రైలు మార్గం, భూమి అప్పగించాలని నిర్మాణ సంస్థ ఒత్తిడి చేస్తోంది. వాస్తవానికి అలైన్ మెంట్ ప్రకారం ఎంజీబీఎస్, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్ గంజ్, జంగమ్మెట్, ఫలక్ నుమా వరకూ అలైన్ మెంట్ ప్రతిపాదన ఉంది. ఈ మార్గంలో వెళితే భారీగా ఆస్తులు కోల్పోవాల్సి వస్తుందనేది మజ్లిస్ వాదన. అంతే కాదు.. చాలా ప్రార్థనామందిరాలను కూల్చాల్సి ఉంటుంది. ఇందుకు మజ్లిస్ అంగీకరించడం లేదు. అందుకే ఈ మార్గానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఓవైపు ప్రభుత్వం రూటు మార్చమంటోంది.. మరోపక్క మజ్లిస్ కూడా అదే పాట పాడుతోంది. ఇన్ని వత్తిళ్ల మధ్య ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తుందోనన్న ఆసక్తి కలుగుతోంది. మజ్లిస్ వాదనతో ఎల్ అండ్ టీ ఏకీభవిస్తుందా.. లేకుంటే తమ అలైన్ మెంట్ ప్రకారమే ముందుకెళ్తుందా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్ ను కలిశారని తెలుస్తోంది. మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో.. ఎలా పరిష్కారమవుతుందో.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: