ఆర్టీసీ.. ఇది సామాన్యుడి వాహనం. ప్రజారవాణాలో దీనిదే పెద్దపీట. అలాంటి ఆర్టీసీ నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కొత్త బస్సులు కొనలేక, డొక్కు బస్సులు నడపలేక సతమతమవుతోంది. అప్పులు, కట్టాల్సిన వడ్డీలు తడిసి మోపెడై సంస్థ కుంగిపోతోంది. నష్టాలు, నిర్వహణ వ్యయాలు ఏటికేడు కొండలా పెరుగుతున్నాయి. తెలుగు ప్రభుత్వాలు..దీన్ని ప్రజాసేవాసంస్థలా భావించకుండా వ్యాపార సంస్థగా భావించి.. సాయమందించకపోగా.. పన్నులభారం మోపుతూ కోట్లు పిండుకోవడంతో నష్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన తెలుగు ప్రభుత్వాలు ఈ నష్టాలు తీర్చి ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నం చేయకపోగా.. అనవసర ఖర్చు పెంచే ప్రతిపాదనలు తెస్తున్నాయి. టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు... తమ పార్టీ రంగులను ఆర్టీసీ బస్సులపై రుద్దేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో వైఎస్ సర్కారు ఇందిరమ్మ ఇళ్లకు మూడు రంగులు వేయించినట్టు.. వీరి కూడా తమ పార్టీ రంగులను బస్సులపై వేయిస్తారట. ఆంధ్ర ప్రాంతంలో పసుపు రంగు... తెలంగాణా ప్రాంతంలో గులాబీ రంగు ఇక బస్సులపై కనిపిస్తాయన్నమాట. తమ సొంత బస్సుల్లా రంగులు వేయాలని నిర్ణయిస్తున్న ప్రభుత్వాలు ఆర్టీసీ నష్టాల గురించి కూడా కాస్త పట్టించుకుంటే మంచిదేమో. బస్సుల రంగులు మార్చడమే కాదు... వాటి సర్వీసుల పేర్లు కూడా మార్చే ఆలోచన చేస్తున్నారు ఇరు ప్రాంతాల అధికారులు. ప్రస్తుతం ఉన్న పల్లెవెలుగు, శీతల్ బస్సుల పేర్లను మార్చాలని యోచిస్తున్నారు. ఇందుకోసం తెలుగువెలుగు, పల్లెవారథి, గ్రామరథం వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఈ మార్పులన్నీ పల్లెవెలుగు, శీతల్ బస్సుల్లోనే ఉంటాయట. మిగిలిన సర్వీసుల జోలికి పెద్దగా వెళ్లకపోవచ్చని సమాచారం. ఆర్టీసీ విభజనకు ఇంకా రెండు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు.. ఆర్టీసీ విభజన తర్వాతే అమల్లోకి వస్తాయన్నమాట..

మరింత సమాచారం తెలుసుకోండి: