భారత్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా, వ్యాపారహిత దేశంగా మార్చుతున్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. బొగ్గు క్షేత్రాల లైసెన్సులను రద్దుచేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పెట్టుబడుల పురోగమణానికి అనుకూలంగా, గత చేదు జ్ఞాపకాలను తుడిచేసేలా మలుచుకుంటామని చెప్పారు. భారీగా పెట్టుబడులను ఆకర్శించటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన, ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) అమెరికాలోని ప్రముఖ కంపెనీల అధినేతలతో సమావేశమయ్యారు. ఆసియాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతే అత్యంత అనుకూల దేశమని వివరించారు. 11 సంస్థల సీఈవోలతో ఆదివారం ఉదయం అల్పాహార సమావేశంతో మోదీ తన కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానితో కలిసి గూగుల్ సీఈవో ఎరిక్ స్కిమిడ్, పెప్సీకో సీఈవో ఇంద్రానూయీ, కాైర్లెల్ గ్రూప్ అధిపతి డేవిడ్ ఎం రూబెన్‌స్టిన్, సిటీ గ్రూప్ సీఈవో మైకేల్ కార్బాట్, క్యాటర్‌పిల్లర్ ఇంక్ సీఈవో డగ్‌ఒబెర్రెల్‌మ్యాన్, హాస్పిరా ఇంక్ సీఈవో మైకేల్‌బాల్, మెర్క్‌అండ్ కో అధినేత కెన్నెత్ సీ ఫ్రాజీర్ అల్పాహారం స్వీకరించారు. అనంతరం మరో ఆరు సంస్థల సీఈవోలతో వేర్వేరుగా ప్రధాని సమావేశమయ్యారు. బోయింగ్ చైర్మన్ డబ్ల్యూ జేమ్స్‌మెక్‌నెర్నీ జూనియర్, బ్లాక్‌రాక్స్ సీఈవో లారెన్స్ డీ ఫింక్, ఐబీఎం సీఈవో గిన్నీరొమెట్టీ, జనరల్ ఎలక్ట్రిక్ చైర్మన్ జెఫ్రీ ఆర్ ఇమ్మెల్ట్, గోల్డ్‌మన్‌సాచ్చ్ సీఈవో ఎల్‌లాయిడ్ బ్లాంక్‌ఫీన్, కోల్బర్గ్ క్రావిస్ రాబర్ట్ అండ్ కో సీఈవో హెన్రీ క్రావిస్‌తో భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో 15 నుంచి 20 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని సీఈవోలను కోరారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు. భారత్‌లో పెట్టుబడులపై సీఈవోలు వ్యక్తంచేసిన ఆందోళనలను శ్రద్ధగా విన్న ఆయన, వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేం చాలా విశాల దృక్పథంతో ఉన్నాం. మార్పును కోరుకొంటున్నాం. అది ఏకపక్షంగా ఉండదు. పౌరులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చించి నిర్ణయాలు తీసుకొంటున్నాం అని మోదీ వివరించినట్లు భారత విదేశంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. సీఈవోలందరికీ భారతీయ టీని మోడీ బహుమతిగా ఇచ్చారు. అమెరికా నేతల మనసు గెలిచిన మోదీ న్యూయార్క్, సెప్టెంబర్ 29: ప్రధాని హోదాలో అమెరికాలో మొదటిసారి అడుగుపెట్టిన నరేంద్రమోదీ ఇంటగెలిచి రచ్చ గెలువాలన్న సామెతను నిజం చేస్తున్నారు. తన నాయకత్వ పటిమతో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం సాధించినపెట్టి భారతీయుల మనసు గెలిచిన ఆయన, అమెరికాలో ఆ దేశ నాయకులను సైతం విశేషంగా ఆకర్శిస్తున్నారు. మాడిసన్‌స్వేర్ గార్డెన్‌లో శనివారం ఆయన చేసిన ప్రసంగం భారతీయ అమెరికన్లనేకాకుండా అమెరికన్ చట్టసభ సభ్యులను కూడా సమ్మోహితులను చేసింది. ఎన్నడూ లేనివిధంగా ఈ కార్యక్రమానికి 40మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొనటం మోదీపట్ల వారు చూపుతున్న ఆసక్తిని తెలుపుతున్నది. మోదీ ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, ఆయన గొప్ప లక్ష్యమున్న వ్యక్తి అని అమెరికన్ నేతలు కొనియాడుతున్నారు. మోదీకి భారత ప్రజలు ఎందుకంత మెజారిటీ కట్టబెట్టి ప్రధానిని చేశారో ఇప్పుడు అర్థమవుతున్నదని కాంగ్రెస్ సభ్యుడు హెన్రీ సీ హంక్ జాన్సన్ వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా సంబంధాలను మోదీ మరో మెట్టు పైకి తీసుకెళ్లారని గ్రేస్‌మెంగ్ పేర్కొన్నారు. కొత్త భారతదేశానికి మోదీ ప్రతినిధి అని మరో కాంగ్రెస్ ప్రతినిధి సింథియా లుమిని ప్రశంసించారు. అయితే, అమెరికా నేతలను మోదీ ఎంతగా ఆకర్శిస్తున్నప్పటికీ ఆ దేశంలోని సగంమంది వ్యాపారవేత్తలు భారత్‌లో వ్యాపారం చేసేందుకు విముఖత చూపుతున్నారని ఏపీసీవో తాజాగా నిర్వహించిన సర్వేలో తేలటం గమనార్హం. ప్రధానితో భేటీ అద్భుతం: సీఈవోలు ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా సాగిందని సీఈవోలు తెలిపారు. తాము అడిగిన ప్రతి ప్రశ్నకూ ప్రధాని చాకచక్యంగా సమాధానాలివ్వటం ఆశ్చర్యచకితుల్ని చేసిందని పెప్సీకో సీఈవో ఇంద్రానూయీ అన్నారు. సీఈవోలు చెప్పినవన్నీ విని పెట్టుబడులకు కీలకమైన టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్, మౌలికవసతులు తదితర రంగాలతో ప్రధాని ఒక లిస్టును తయారుచేశారని మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్‌బంగా వెల్లడించారు. కాగా, మోదీ ప్రభుత్వ చేపడుతున్న సుందర నగరాలు, డిజిటల్ ఇండియా తదితర ప్రాజెక్టుల్లో పాలుపంచుకొనేందుకు ఐబీఎం సంస్థ ఆసక్తి చూపింది. రక్షణ, పౌర వైమానిక రంగాల్లో సహకారానికి బోయింగ్ సంస్థ ముందుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: