తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అమలు పరుస్తున్న ఒక్కో ప్రణాళికనూ చూస్తుంటే విశాఖ పట్టణం కాస్తా అతి త్వరలోనే హైదరాబాద్ స్థాయిని దాటిపోతుందని.. ప్రత్యేకించి ఐటీ విషయంలో విశాఖ హైదరాబాద్ కు మించిన అభివృద్ధిని సాధించేస్తుందని అంటున్నాడు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు. ప్రస్తుతం విశాఖ పట్టణాన్ని ఐటీ హబ్ గా మార్చేస్తామనే హామీని గుప్పిస్తున్న ప్రభుత్వం వారు ఈ విషయంలో చాలా గట్టిగా ప్రచార పనులు చేస్తున్నట్టుగా ఉన్నారు. సాధారణంగా చంద్రబాబు ను బీజేపీ వారు మరీ గట్టిగా పొగిడే పరిస్థితి లేదు. అయినప్పటికీ కంభంపాటి ఈ విధంగా ప్రశంసిస్తున్నాడంటే.. అది విశాఖ విషయం కాబట్టి అనుకోవాల్సి వస్తోంది. విశాఖను అభివృద్ధి చేస్తున్నాం.. అనే అభిప్రాయాన్ని కలిగించడం కూడా కంభంపాటికి ముఖ్యమే. అందుకే ఈయన ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించేస్తున్నారు! బాబు ఒక్కో ప్రణాళికనూ వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగోతందని... ఇంతింత అభివృద్ధి సాధించేస్తున్నామని... త్వరలోనే అందరినీ మించి పోతున్నామనే... అతిశయోక్తి పూర్వక మాటలను చెప్పాడాయన. ప్రస్తుతానికి విశాఖ పట్టణానికి 1820 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని ఫలితంగా 20 వేల ఉద్యోగాలు సాధించామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మరి ఈ ఊద్యోగాలు ఇప్పటికే ఇచ్చేశారా... ఇవ్వబోతున్నారా... అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు అని మాత్రమే అంటున్నారు. ఇచ్చామా... అన్ని ఉద్యోగాల కల్పన చేయబోతున్నామా.. అనే విషయం గురించి వారు మాట్లాడటం లేదు. క్రియా రహితంగానే మాట్లాడుతున్నారు! మరి ఇలా బండిని ఎన్ని రోజులు నడిపిస్తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: