అనాథలమైపోయామన్న బాధ. నిస్సహాయత, అసంతృప్తి, చిరునవ్వూ లేదు.. చప్పట్లూ లేవు.. తాము మంత్రులమయ్యామన్న సంతోషం కన్నా.. అమ్మ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన..ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంతో పాటు 30 మంది మంత్రుల భావోద్వేగమిది అమ్మ పరిస్థితి తలచుకొని ఉద్వేగానికి లోనైన సెల్వం, ఇతర మంత్రులు ఓవైపు ప్రమాణం చేస్తూనే ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక భోరుమన్నారు. వెంటతెచ్చుకున్న జయ ఫొటోను ముందు పెట్టుకొని ప్రమాణం చేసిన పన్నీరు తన వీరవిధేయతను చాటుకున్నారు. ప్రమాణస్వీకారం చేయగానే మళ్లీ ఫొటోను జేబులో పెట్టుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రోశయ్య పన్నీరుసెల్వం చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఊహించని రీతిలో రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించిన పన్నీరు.. ప్రమాణం చేస్తూనే కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించింది. ఓవైపు గవర్నర్ శుభాకాంక్షలు చెబుతున్నా.. ఆయన మాత్రం ఏడుస్తూనే ఉన్నారు. రోశయ్య ఆయనను ఓదార్చడం కనిపించింది. ఆయనతో పాటు మిగతా మంత్రుల మొహాలూ దీనంగా కనిపించాయి. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రమాణస్వీకార కార్యక్రమం సాదాసీదాగా జరిగిపోయింది. ప్రతిపక్షానికిగానీ, మీడియాకుగానీ ఆహ్వానాలు అందలేదు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌కే కౌల్‌కు మాత్రమే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. జయ కేబినెట్‌లో పనిచేసిన మంత్రులందరికీ కొత్త కేబినెట్‌లోనూ స్థానం కల్పించారు. ఎవరి శాఖలు వారికి కేటాయించారు. హోం, ఆర్థికశాఖలు మాత్రం పన్నీరు తన దగ్గరే పెట్టుకున్నారు. 2001లోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే పన్నీరుసెల్వం తొలిసారి సీఎం అయ్యారు. అప్పుడు తాన్సీ కేసులో జయకు జైలు శిక్ష పడటంతో పన్నీరు ఆరు నెలల పాటు సీఎంగా ఉన్నారు. కొనసాగుతున్న ఆందోళనల ----------------------------- జయలలితకు జైలు శిక్ష వేయడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు, సానుభూతిపరులు వరసగా మూడోరోజు కూడా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. ఏఐఏడీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎంజీ రామచంద్రన్ స్మారక చిహ్నం దగ్గర నిరాహార దీక్షలు చేశారు. మధురై, ఈరోడ్, ట్యూటికోరిన్, రామేశ్వరంలలో కూడా ఇలాంటి ఆందోళనలే జరిగాయి. అయితే ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు. తమ అధినేత్రి మచ్చలేని మనిషిగా మళ్లీ బయటకు వస్తారన్న నమ్మకం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల జయకు మద్దతుగాస్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. 16 మంది ఆత్మహత్య ----------------------- అమ్మ జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక శనివారం నుంచి 16 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు ఆత్మాహుతి చేసుకోగా.. మరికొందరు ఉరి వేసుకొని చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆత్మాహుతి చేసుకున్న వాళ్లలో తిరుప్పూర్‌కు చెందిన పన్నెండోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. నేడు సినిమా ఇండస్ట్రీ బంద్ జయలలితకు మద్దతుగా కోలీవుడ్ మంగళవారం బంద్ పాటించనుంది. షూటింగ్‌లతో పాటు సినిమా ప్రదర్శనలు కూడా నిలిపేయాలని నిర్ణయించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ దీక్ష చేయనున్నారు. అమ్మ సీట్లో కూర్చోలేను -------------------------- ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కేటాయించిన చాంబర్‌లో కూర్చోడానికి పన్నీరుసెల్వం నిరాకరించారు. జైలుకు వెళ్లే ముందు వరకూ జయలలిత ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు నిర్వహించేవారు. అమ్మ కూర్చున్న చాంబర్‌లో తాను కూర్చోలేనని పన్నీరు స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిగా గతంలో తాను ఉన్న కార్యాలయం నుంచే విధులు నిర్వహించారు. 2001లో సీఎంగా ఉన్న సమయంలోనూ పన్నీరు ఇలాగే చేశారు. మరోవైపు ప్రమాణస్వీకారం చేయగానే మంత్రివర్గంలోని సీనియర్ సభ్యులతో కలిసి పన్నీరు అమ్మ దర్శనం కోసం బెంగళూరు వెళ్లారు. కర్ణాటక హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్ -------------------------------------------- రెండు రోజులుగా బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత నాలుగేళ్ల జైలుశిక్షను సవాలు చేస్తూ సోమవారం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు శిక్ష అనుభవిస్తున్న మిగతా ముగ్గురు కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. హైకోర్టుకు దసరా సెలవులు ఉన్నా వెకేషన్ బెంచ్ మంగళవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనున్నది. జయకు సాధ్యమైనంత తొందరగా బెయిల్ మంజూరు చేయించడానికి సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని ఆమె తరఫున వాదించనున్నారు. ఇప్పటికే జయ తరఫు సీనియర్ న్యాయవాదులు ఆయనతో సంప్రదింపులు జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: