అన్నా డిఎంకె అధినేత్రి, తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత బెయిల్‌ పిటిషన్‌పై కర్నాటక హైకోర్టులో బుధవారం విచారణ జరగనున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తక్షణమే తనకు బెయిల్‌ ఇవ్వాలని, తనకు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ జయలలిత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణను వెకేషన్‌ బెంచ్‌ అక్టోబరు 6వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ప్రముఖ సీనియర్‌ న్యాయవాది రామ్‌జెత్మలానీ నాయకత్వంలోని జయలలిత తరపు న్యాయవాదులు కోర్టు రిజిష్ట్రారును కలిసి ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల అభ్యర్ధనను మన్నించిన చీఫ్‌ జస్టిస్‌ డిహెచ్‌ వాఘెలా మాజీముఖ్యమంత్రి పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారని ఆమె తరపు న్యాయవాది చెప్పారు. జయ బెయిల్‌ కోసం రామ్‌ జెత్మలానీ వాదించారు. జయ బెయిల్‌ పిటిషన్‌ ఉదయం వెకేషన్‌ బెంచ్‌ ముందుకు రాగానే జెత్మలానీ మాట్లాడుతూ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 389 సెక్షన్‌ కింద జయలలిత శిక్షను నిలిపివేయాలని, ఆమెను వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. శిక్షకు గురైన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ పెండింగ్‌లో వుంటే శిక్షణ అమలు లేదా నిలిపివేతపై అప్పీలేట్‌ కోర్టు తీర్పు ఇవ్వవచ్చని సెక్షన్‌ 389 పేర్కొంటున్నది. శిక్షపడిన వ్యక్తి నిర్బంధంలో వుంటే ఆమె లేదా అతడును బెయిల్‌పై లేదా సొంత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని చెబుతోంది. కాగా, హైకోర్టులో దాఖలైన జయ పిటిషన్‌పై ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా తనను నియమిస్తూ ఎలాంటి నోటిఫికేషన్‌ తనకు అందలేదని, ప్రత్యేక కోర్టులో ఎస్‌పిపిగా పనిచేసిన జి.భవానీసింగ్‌ న్యాయమూర్తికి వివరించారు. ఈ కేసు విచారణ కోసం తనను ఎస్‌పిపిగా నియమించినట్లు పత్రికల్లో తాను చూశానని, అయితే, అధికారిక నోటిఫికేషన్‌ ఏదీ తనకు అందలేదని ఆయన చెప్పారు. అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్‌ అందనంత వరకూ ఈ కేసును వాదించే హక్కు తనకు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేసును కొంతకాలం వాయిదా వేయాలని సింగ్‌ న్యాయమూర్తిని కోరారు. దీంతో వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రత్నకళ కేసు విచారణను అక్టోబరు 6వ తేదీకి వాయిదా వేశారు. సత్వరమే తనకు బెయిల్‌ మంజూరు చేయాలని, శిక్షను నిలిపివేయాలని కోరుతూ జయ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ కోర్టు పలు కోర్టుల తీర్పులను పట్టించుకోలేదని జయ తన పిటిషన్‌లో వాదించారు. పలు ఆదాయపన్ను ఆదేశాలు, ఆదాయపన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయాలను పట్టించుకోలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: