ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌పై న్యూయార్క్‌లో జరిగిన దాడి అంశంపై మోదీ దృష్టి సారించినట్టు.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన గుజరాతీ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ.. అమెరికాలో రాజ్‌దీప్‌ను కలిసి మాట్లాడటమే ఇం దుకు నిదర్శనం. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ను తాను వాషింగ్టన్‌ డీసీలో ఒక రెస్టారెంట్‌లో కలిశానని అదానీ ధ్రువీకరించారు. ‘‘సోమవారం సాయంత్రం ఆయ న్ను కలిశాను. మేమిద్దరం కొన్ని నిమిషాల సేపు మాట్లాడుకున్నాం. ఆయనపై దాడి జరిగిన విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. అలాంటి ఘటనలను ఏ నేతా సహించడు, మోదీ అందుకు మినహాయింపు కాదని చెప్పాను’’ అని ఆయన వివరించారు. ‘‘ఆ రోజు జరిగిన దాని గురించి రాజ్‌దీప్‌ నాతో వివరంగా చెప్పా రు. జరిగిన దానికి చింతిస్తున్నానన్నారు. అక్కడ గుమిగూడిన జనమంతా తన కుమారుడిని ఉద్దేశించి దుర్భాషలాడారని, దాంతో తానెంతో క్షోభకు గురయ్యానని రాజ్‌దీప్‌ చెప్పారు’’ అని అదానీ వెల్లడించారు. కాగా.. మోదీ తరఫునే ఆయన రాజ్‌దీప్‌ను కలిశారని వచ్చిన వార్తలను ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రధాని ఇలాంటి చిన్న విషయాలను ఎందుకు చర్చిస్తారు?’’ అని అదానీ బదులిచ్చారు. మరోవైపు.. ఈ ఘటనతో మోదీ అప్‌సెట్‌ అయ్యారని, ఆయనే అదానీ ద్వారా సర్దేశాయ్‌కు వ్యక్తిగత సందేశం పంపారని రెడిఫ్‌ వెబ్‌సైట్‌ ఒక కథనంలో పేర్కొంది. ఆ రోజు అక్కడున్నవారిలో ఒకరు వెనుక నుంచి రాజ్‌దీప్‌ను కొట్టారని.. దురదృష్టవశాత్తూ ఆ ఘటన వీడియోలో రికార్డు కాలేదని అందులో వివరించింది. మరో వ్యక్తి రాజ్‌దీప్‌ను ఉద్దేశించి.. ‘నీ భార్య సాగరికాఘోష్‌తో, నీ పిల్లలతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపో’ అన్నారని, ఆ మాటలతో బాధపడ్డారని కథనంలో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: