రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే పింఛన్లకు ‘ఎన్టీఆర్ భరోసా’ అని నామకరణం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కానె్ఫరెన్స్‌లో ఈ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జన్మభూమి- మావూరు, పింఛన్లు, అభివృద్ధి, సంక్షేమం, పాలనవంటి అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. సమావేశంలో అనేక జిల్లాల నుంచి మంత్రులు పాల్గొన్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిశితంగా చర్చించారు. జన్మభూమి- మావూరు కార్యక్రమంలో అమలు చేయనున్న అనేక కార్యక్రమాలను సమీక్షించారు. ప్రధానంగా పింఛన్లపై మాట్లాడుతూ పెంచిన పింఛన్లను సక్రమంగా లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో పింఛన్ల పథకానికి పేరు పెట్టే అంశంపైనా చర్చ జరిగింది. అనేక పేర్లు చర్చకు వచ్చినప్పటికీ చివరకు ఎన్టీఆర్ భరోసా అన్న పేరును చంద్రబాబు అంగీకరించారు. అలాగే జన్మభూమి కార్యక్రమాన్ని 2నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి వరకూ అధికారులు చేరుకుని కార్యక్రమాన్ని ప్రజలకు అనుకూలంగా అమలు జరిగేలా చూడాలన్నారు. జన్మభూమి- మావూరు కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధికి నిర్ణయించామని, కార్యక్రమంలో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా ఆ గ్రామానికి చెందినవారంతా పాత్రధారులు కావాలని మార్గదర్శనం చేశారు. కొత్త రాజధాని విజయవాడ నుంచి తాను జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటానని, ఇతర ప్రాంతాల్లోనూ మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని స్పష్టం చేశారు. పింఛన్ల వివరాలను అక్టోబర్ 2న ఆన్‌లైన్‌లో ప్రకటిస్తామని, అప్పటినుంచి వారికి పింఛన్లు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని వ్యాఖ్యానించారు.  రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి ప్రజల్లోకి వెళ్తున్నామని, అందువల్ల ప్రజల సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలనుంచి వచ్చే వినతులు, వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించేందుకు అధికారులు, మంత్రులు చొరవ చూపించాలని ఆదేశించారు. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, స్వచ్ఛ భారత్, పేదరికం, నీరు- చెట్టు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సంతోషం, సంతృప్తి, ఆరోగ్యం ఐదు రెట్లు పెంచేలా పాలన ఉండాలన్న సూత్రాన్ని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. వీటిపై ఎక్కువగా దృష్టి సారించాలని ఆదేశించారు. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించాలన్నారు. పట్టణాలు, గామాల్లో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో పాలన అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని, దీనికోసం అంతా సిద్ధం కావాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: