ప్రధానమంత్రి మరోసారి ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మోడీ అక్టోబరు 4వ తేదీ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఆయన పలు ర్యాలీల్లో పాల్గొంటారు. మోడీతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మా స్వరాజ్‌, ఎం.వెంకయ్యనాయుడు రెండు రాష్ట్రాల్లో బిజెపి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి ఒంటరిగా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది. హర్యానా, మహారాష్ట్రలలో 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం చేస్తారని, మొదటి రోజు హర్యానాలోని కర్నాల్‌ నుండి మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. కొల్హాపూర్‌, బీద్‌, ముంబయి మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని బిజెపి ఉపాధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సీనియర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. వారు రెండు రాష్ట్రాల్లో మూడు నుండి ఐదు రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తారు. కాంగ్రెస్‌ దుష్టపాలనను, బిజెపి అభివృద్ధి, సుపరిపాలనను వారు ప్రజలకు వివరిస్తారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ దుష్టపాలనకు చరమగీతం పాడటం, బిజెపి సుపరిపాలన ఏర్పాటు చేయడం తమ ప్రధాన లక్ష్యమని నక్వీ చెప్పారు. మోడీతో కలిసి సాగుదాం నినాదంతో తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌-ఎన్‌సిపి దుష్టపాలన కారణంగా గత 15 ఏళ్లుగా మహారాష్ట్ర అభివృద్ధికి ఆమడదూరంలో వుందని, అవినీతి, దుష్టపాలన కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నదని ఆయన ఆరోపించారు. రైతులు బాధపడుతున్నారు. యువతకు సాయమందడం లేదు. నిరుద్యోగం తాండవిస్తోంది. వాణిజ్యం, పరిశ్రమలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: