ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సాక్షి మీడియాకు ప్రవేశంపై వేసిన నిషేధాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎత్తివేసినట్టుగా ఉంది. బుధవారం చంద్రబాబు ఇంటిలో జరిగిన మీడియా సమావేశంలో సాక్షి జర్నలిస్టులు పాల్గొన్నారు! సాక్షి టీవీలో ఆ కార్యక్రమాన్ని లైవ్ లోకూడా ప్రసారం చేశారు. దీంతో జగన్ కు సంబంధించిన మీడియా పై చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేసినట్టు అయ్యింది. తెలుగుదేశం వాళ్లు చాలా కాలం క్రితమే సాక్షి పై నిషేధం విధించారు. తమ పార్టీ కార్యకపాలకు సంబంధించిన వార్తలు సాక్షి రాయనక్కర్లేదని, సాక్షి టీవీలో చూపనక్కర్లేదని అంటూ తెలుగుదేశం పార్టీ జగన్ మీడియాపై నిషేధం విధించింది. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఆ నిషేధాన్ని ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో కూడా అమలు పరిచారు! అయితే ఈ తీరుపై జగన్ మీడియా నిరసన వ్యక్తం చేసింది. దీని పై ధర్నాలు ర్యాలీలు నిర్వహించడంతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించి పీసీఐ ఏవో చర్యలు తీసుకొన్నట్టు ఉంది. సాక్షి , టీ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం పాటిస్తున్న వివక్ష గురించి సమీక్షించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ ఇంకా తన పనిని మొదలు పెట్టిందో లేదో కానీ.. ఇంతలోనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి సాక్షికి ఆహ్వానం దక్కింది. అయితే ఈ నిషేధం ఎత్తివేత అనేది కేవలం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల విషయంలోనే అని.. తెలుగుదేశం అధికారిక కార్యక్రమాల విషయంలో సాక్షి పై నిషేధం కొనసాగుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు! అయినా టీడీపీ కార్యక్రమాలపై సాక్షికి కూడా పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు! ప్రభుత్వ వ్యవహారాల్లో నిషేధాన్ని టీడీపీ వారు కొనసాగించలేకపోయారని చెప్పవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: